ఒకప్పుడు అత్యాచారాలు అంటే యువతులపై జరిగేవి అనుకున్నాం. కొన్నాళ్లకు బాలికలపై జరగడం ప్రారంభమయ్యాయి. ఇప్పుడు నెలల పిల్లలపై జరుగుతున్నాయంటే... అభివృద్ధి చెందుతున్న దేశం అనాలో దిగజారిపోతున్న నాగరికత అనాలో తెలియని అసమాన స్థితిలో ఉంటున్నాం. ఆడపిల్లకి నగలు పెట్టి సింగారించి మురిసి పోయేకాలం నుంచి... ఎందుకు పెట్టానా అని బాధపడే స్థితికి వచ్చాం.
చిట్టి తల్లిని కోల్పోయిన అమ్మ పట్టీలు వేయడం వల్లే తన కుమార్తె ఆడపిల్లని ఆ కామాంధుడికి తెలిసిందని బాధపడుతోంది. వేయకుంటే బాగుండేదని కుమిలిపోతుంది కానీ... వయసు పెరిగిన తర్వాతైనా ఆ కామాంధుల చెర నుంచి తన బిడ్డను ఎలా కాపాడగలదు ఆ పిచ్చితల్లి. లేదంటే రాణి రుద్రమదేవిలాగా మగవాడిలా పెంచి ధైర్యసాహసాలు నూరిపోయగలదా?
చట్టాలతోనే మార్పు వస్తుందా?
చట్టాలు ఏవైనా... కొత్తగా ఎన్ని వచ్చినా అమలు చేయకపోతే అన్ని వృథానే... కోర్టుల్లో న్యాయం జరగట్లేదు అనలేం కానీ... అమలయ్యేలోపు నిందితులు తప్పించుకుంటున్నారనేది వాస్తవం. అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో పోటీపడే మనం చట్టాలను అమలు చేయటంలో చొరవ చూపితే హత్యాచారాలను పూర్తిగా అరికట్టలేకపోయినా కామాంధుల్లో కొంతైనా మార్పు తీసుకురావచ్చేమో.
ఇలాంటి కేసుల్లో పట్టుబడిన కామాంధులు అధికంగా చెప్పే సమాధానం "తాగినప్పుడు విచక్షణ కోల్పోయి ప్రవర్తించామని" అంటుంటారు. నిజంగా మత్తులోనే వారు ఈ దుస్సాహసానికి ఒడుగడుతున్నారా? నిజమే అయితే చట్టాలు మార్చితే న్యాయం ఎలా జరుగుతుంది. మద్యపానాన్ని అరికట్టాలంటారా? వీటిని అరికట్టడంలో వైఫల్యం ఎవరిదనుకోవాలి?... సరే తప్పు ఎవరిదైనా కావచ్చు. మరీ విచక్షణ కోల్పోయేలా తాగేంత పరిస్థితులు ఎలా వచ్చాయి. పెరిగిన వాతావరణమే మంచి నుంచి చెడువైపు మళ్లిస్తుందా? వీటన్నింటికి సమాధానం ఎప్పుడు దొరుకుతుంది.
"ఎముకలు కుళ్లిన... వయసు మళ్లిన... సోమరులారా చావండి అన్న శ్రీశ్రీ... నేటి దుర్గతిని చూసి "కామంతో నిండిపోయినా... క్రూరత్వం పెరిగిన యువకులారా చావండి" అని మార్చేవాడేమో!
బ్రిటీష్ వాళ్లు భారతీయ పౌరులను హింసించి... ఆడకూతుళ్లను చెరస్తుంటే చూస్తు ఊరుకుండలేక ఉద్యమాన్ని ప్రారంభించి...శాంతితో ఎదిరించి స్వాతంత్య్రం సంపాదించిన గాంధీకి ప్రస్తుతం పరిస్థితులు తెలిస్తే ఎంత కుమిలిపోతాడో.
ఏదైనా గొడవ జరగ్గానే న్యాయం కావాలంటూ ర్యాలీలు చేసి, సామాజిక మాధ్యమాల్లో తిట్టిపోసే యువత... న్యాయం జరిగే వరకూ ఎందుకు పోరాడలేకపోతుంది. న్యాయదేవత మాత్రం ఎన్నాళ్లు చూస్తూ ఊరుకుంటుంది విసుగురాదా తనకి. వేసారిపోదా ఈ సమాజ పోకడకి. తను కళ్లెర్ర చేసేదెప్పుడు.. నిందితులకు శిక్ష పడేది ఎప్పుడూ?
ఇవీ చూడండి: మానవత్వం లేని మగ మృగాలు