తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ట్రంప్​ను ఢీకొట్టేది ఎవరు? - ట్రంప్​

కమలా హారిస్​, తులసీ గబార్డ్​... 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన మహిళలు. ఒకరు భారత సంతతి వ్యక్తి. మరొకరు హిందువు. వీరితోపాటు డెమొక్రటిక్ పార్టీ నుంచి మరికొందరు దిగ్గజ నేతలు పోటీపడుతున్నారు. వీరిలో 'ప్రైమరీ'ల సవాలును అధిగమించేదెవరు? తుది పోరులో నిలిచేదెవరు?

అమెరిాకా ఎన్నికలు

By

Published : Feb 10, 2019, 6:53 PM IST

ప్రపంచ పెద్దన్నగా పేరు. ఇతర దేశాల ఆర్థిక, రాజకీయ, సామాజిక స్థితిగతుల్ని తారుమారు చేయగల సత్తా. అలాంటి శక్తిమంతమైన దేశానికి అధ్యక్ష పదవి అంటే ఆషామాషీ కాదు. అందుకే అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ప్రపంచవ్యాప్తంగా అంత ప్రాముఖ్యం.

2016లో అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. రిపబ్లికన్​ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్​ విజేతగా నిలిచారు. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్​ పరాజయం చవిచూశారు. తదుపరి ఎన్నికలు 2020లోనే అయినా... అగ్రరాజ్యంలో ఇప్పుడే హడావుడి మొదలైపోయింది.

ట్రంప్​ విధానాల్ని ఎప్పటికప్పుడు విమర్శిస్తున్న ప్రతిపక్ష డెమొక్రటిక్​ పార్టీ... వచ్చే ఎన్నికల్లో విజయంపై భారీ ఆశలు పెట్టుకుంది. మరి ట్రంప్​ను ఢీకొట్టేది ఎవరు? డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి ఎవరు? ఈ ప్రశ్నకు ఒకటి కాదు, రెండు కాదు... అనేక పేర్లు సమాధానంగా వినిపిస్తున్నాయి. ఇందులో మహిళలు ఎక్కువగా ఉండడం ఆసక్తికరాంశం.

1.ఎలిజబెత్​ వారెన్​:

* అధ్యక్ష ఎన్నికల రేసులో ఉన్నట్లు ప్రకటించిన డెమొక్రాట్లలో అత్యంత ప్రముఖ వ్యక్తి
* మసాచుసెట్స్​ నుంచి అమెరికా ఎగువసభకు ప్రాతినిధ్యం
* అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై డిసెంబర్​ 31న సంకేతాలు-ఈనెల 9న అధికారిక ప్రకటన
* వాల్​స్ట్రీట్​ తప్పుడు నిర్ణయాలపై గళమెత్తడం ద్వారా ప్రజల్లో మంచి పేరు
* అధ్యక్ష ఎన్నికల ప్రచారం కోసం అత్యుత్తమ వ్యవస్థ కలిగిన డెమొక్రటిక్​ నేత
* ఎలిజబెత్​పై ఇప్పటికే విమర్శలు ప్రారంభించిన ట్రంప్

2. కమలా హారిస్​

* భారత్​-జమైకా సంతతి మహిళ
* కమల తల్లి అమెరికాలో స్థిరపడ్డ భారతీయ వైద్య పరిశోధకురాలు
* తండ్రి జమైకా నుంచి వచ్చిన ఆర్థిక శాస్త్ర నిపుణుడు
* కాలిఫోర్నియా నుంచి సెనేట్​కు ప్రాతినిధ్యం
* కాలిఫోర్నియా అటార్నీ జనరల్​గా పనిచేసిన అనుభవం
* గెలిస్తే... అధ్యక్ష పీఠం అధిరోహించిన తొలి నల్ల జాతి మహిళగా రికార్డు

3. కోరి బుకర్​:

* న్యూజెర్సీ నుంచి సెనేట్​కు ఎన్నికైన తొలి ఆఫ్రికన్-అమెరికన్
* సామాజిక కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభం-నెవార్క్​ మేయర్​గా చేసిన అనుభవం
* అద్భుత వాక్పటిమ కలిగిన నేత-తరచూ ఒబామాతో పోలిక
* ట్రంప్ ప్రతిపాదించిన సుప్రీంకోర్టు నామినీ బ్రెట్​కు వ్యతిరేకంగా బలమైన వాదనలు వినిపించిన కోరి

4. కిర్​స్టెన్​ గిల్లిబ్రాండ్​:

* ట్రంప్​పై పోటీకి సై అన్న 52ఏళ్ల మహిళా సెనేటర్
* "మీటూ"కు ముందే మహిళల సమస్యలపై గళం
* సైన్యంలో లైంగిక వేధింపులకు ముగింపు పలకాలంటూ చేసిన ఉద్యమంతో ప్రజల్లో గుర్తింపు
* లింగ సమానత్వమే ప్రధానాంశంగా అధ్యక్ష ఎన్నికల బరిలోకి...

5. జూలియన్ కాస్ట్రో:

* ఒబామా ప్రభుత్వంలో మంత్రిగా చేసిన అనుభవం
* మెక్సికో నుంచి వలస వచ్చిన వ్యక్తికి మనుమడు
* వలస విధానం, సరిహద్దు భద్రతే ప్రధానాంశాలుగా ఎన్నికల బరిలోకి...
* అమెరికాకు తొలి హిస్పానిక్​ అధ్యక్షుడు కావాలని లక్ష్యం

6. తులసీ గబార్డ్​:

* 37ఏళ్ల హిందూ మహిళ
* హవాయి నుంచి అమెరికా చట్టసభకు ప్రాతినిధ్యం
* సైన్యంలోని వైద్య కేంద్రంలో పనిచేసిన అనుభవం
* సిరియా అంతర్యుద్ధం సమయంలో ఆ దేశాధ్యక్షుడు బషర్​ అల్​ అసద్​ను కలవడంపై విమర్శలు
* స్వలింగ సంపర్కానికి వ్యతిరేకంగా ప్రకటనలు-విమర్శల నేపథ్యంలో క్షమాపణలు

ఇతర డెమొక్రాట్​ నేతలు:

మాజీ సైనికుడు పీట్​ బుట్టిగీగ్​, 44 ఏళ్ల టెకీ ఆండ్రూ యాంగ్​, వ్యాపారవేత్త జాన్ డిలానీ ఇప్పటికే అధ్యక్ష ఎన్నికల రేసులో నిలిచినట్లు ప్రకటించారు.
అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు జో​ బిడెన్​, సెనేటర్లు బెర్నీ సాండర్స్​, షెర్రోడ్​ బ్రౌన్​, అమి క్లోబుచర్... ఎన్నికల్లో పోటీపై స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

ఇంకా చాలా దూరం...

2020 ఆరంభంలో ప్రైమరీ ఎన్నికల సీజన్​ మొదలవుతుంది. అంటే... ఎలిజబెత్, కమల, కోరి, కిర్​స్టెన్​, జూలీ, తులసి తమ పార్టీలోనే పరస్పరం పోటీపడాలి. ఈ ప్రైమరీల్లో విజేతగా నిలిచినవారే డెమొక్రటిక్​ పార్టీకి అధ్యక్ష అభ్యర్థి. నవంబర్​లో జరిగే తుది పోరులో రిపబ్లికన్​ పార్టీ అభ్యర్థితో తలపడతారు.

ABOUT THE AUTHOR

...view details