రాష్ట్రంలో దాహం కేకలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ కింద తాగునీరు అందని ప్రాంతాల్లో ప్రజలు నీటికోసం అల్లాడిపోతున్నారు. ప్రధానంగా సంగారెడ్డి, మేడ్చల్, జోగులాంబ, గద్వాల్, మహబూబ్‌నగర్, మెదక్, వికారాబాద్, నల్గొండ, సిద్దిపేట, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి తదితర జిల్లాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. ఎండల తీవ్రత కారణంగా మరింత ఉద్ధృతమయ్యే ప్రమాదం ఉంది.
తగ్గిపోతున్న భూగర్భజలాలు
అధికంగా నీటిని వినియోగించడం, వర్షపాతం, తేమ పడిపోవడం వలన భూగర్భ జలమట్టం తగ్గిపోతోంది. ఆదిలాబాద్, నల్గొండ, తదితర జిల్లాల్లో గిరిజన తండాల్లో తాగునీటికోసం బోర్లు, చేతి పంపుల వద్ద నానా తిప్పలు పడుతున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో జనం నీటికోసం బిందెలు తీసుకుని మండుటెండల్లో నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
పెరిగిన ఎండల తీవ్రత
గత ఏడాదితో పోల్చితే.. ఈ సంవత్సరం 21 జిల్లాల్లో భూగర్భజలమట్టాలు గణనీయంగా పడిపోయినట్లు భూగర్భ జలవనరుల శాఖ గుర్తించింది. సగటున 1.52 మీటర్లు దిగువకు వెళ్లాయి. ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో ఎండల తీవ్రతతో నీటికొరత మరింత ఏర్పడనుంది. రాష్ట్రంలో గత ఏడాది జూన్ నుంచి ఈ సంవత్సరం మార్చి వరకు 865 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉంది. కానీ 16 శాతం తక్కువగా 724 మీటర్లు మాత్రమే నమోదైంది. ఆ ప్రభావం భూగర్భ జల మట్టంపై పడింది.