తెలంగాణ

telangana

ETV Bharat / briefs

సమస్య ఏదైనా... పోలీస్​స్టేషన్ వెళ్లాల్సిన పని లేదు

ఏదైనా ఒక సమస్య గురించి చెప్పుకోవాలని పోలీస్​స్టేషన్​కు వెళ్లాలంటే ఓ సాధారణ పౌరుడి చాలా భయం. ఎందుకంటే.. అక్కడ వాళ్లు ఎలా ప్రవర్తిస్తారోనని ఓ అనుమానం వెంటాడుతుంటుంది. ఠాణా మెట్లెక్కితే తమ పరువుపోతుందని, అనవసరంగా అల్లరిపాలు కావాల్సి వస్తుందని వెనకడుగు వేస్తుంటారు. కానీ పాలమూరులో పోలీసులే బాధితుల చెంతకు వెళ్లే విధంగా వినూత్న కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు.

పోలీస్​స్టేషన్ వెళ్లాల్సిన పని లేదు

By

Published : Jun 28, 2019, 6:27 PM IST

పోలీస్​స్టేషన్ వెళ్లాల్సిన పని లేదు

నేరాల నియంత్రణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టి సఫలీకృతమైన పాలమూరు పోలీసులు మరో కొత్త కార్యక్రమానికి తెర తీశారు. ఠాణా మెట్లెక్కెందుకు బయపడుతున్న ప్రజానీకానికి... జిల్లా కేంద్రంలోని పోలీసు కవాతు మైదానంలో సురక్ష- మహబూబ్‌నగర్‌ పేరుతో "ప్రజా దర్బార్‌" కార్యక్రమాన్ని నిర్వహించారు.

మీ కోసం ప్రజాదర్బార్...

తమ సమస్యలను పోలీస్​స్టేషన్​కు వెళ్లి చెప్పుకోవడానికి ఇబ్బంది పడే సాధారణ ప్రజానీకానికి.. ప్రజాదర్బార్‌ వేదికైంది. ప్రజల నుంచి సలహాలు.. పోలీసు స్టేషన్లలో పరిస్థితులు.. అధికారుల పనితీరును తెలుసుకునేందుకు జిల్లా పోలీసులు నూతన కార్యక్రమానికి తెర తీశారు.ప్రధానంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న "షీ- బృందాలు, పెట్రోలింగ్‌ వ్యవస్థ, డయల్- 100, గ్రామ, కాలనీ పోలీసు అధికారి వ్యవస్థ వంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. కళా బృందాలతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఏదైన.. సమస్య వస్తే పోలీసులను ఎలా సంప్రదించాలనే విషయాన్ని తెలియజేశారు.

రానున్న రోజుల్లో...

రానున్న రోజుల్లో మండల కేంద్రాలు, గ్రామాలలో సమావేశాలు ఏర్పాటు చేసి అక్కడ ఉన్న సమస్యలను చర్చించనున్నారు. ఆయా ప్రాంతాల్లో పోలీసు శాఖ తరపున తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తారు. అందుకు అనుగుణంగా పోలీసు అధికారుల పనితీరులో మార్పులు చేసుకునే అవకాశం ఉంటుంది. ఫలితంగా పోలీసు వ్యవస్థ పకడ్బందిగా విధులు నిర్వహించే అవకాశం ఉండటం వల్ల నేరాల నియంత్రణకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడుతాయి.

ప్రతి వినతి స్వీకరిస్తారు..

సమస్యలను వివరించేందుకు ప్రత్యేకంగా తయారు చేసిన పత్రాలను పోలీసులు ఏర్పాటు చేశారు. ఆ పత్రాలపై తమ సమస్యలను వివరంగా రాసి అందుకు సంబంధించిన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫిర్యాదు పెట్టెలలో వేసే విధంగా ఏర్పాట్లు చేశారు. ప్రతి వినతిపై పోలీస్‌ శాఖ చర్యలు తీసుకుంటుందని.. వినతి పత్రంలో చరవాణి సంఖ్య ఉంటే.. తీసుకున్న చర్యలను సైతం వివరించే విధంగా ఏర్పాట్లు చేశారు.

అండగా ప్రజాదర్బార్..

సమస్యలను పోలీస్​స్టేషన్‌లలో తమ సమస్యలు నిర్భయంగా చెప్పలేకపోయామని.. ప్రజాదర్బార్​ ఏర్పాటుతో తమ సమస్యలను వివరించేందుకు అవకాశం లభించిందని పలువురు అభిప్రాయపడ్డారు. నేరాలను నియంత్రించడంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే దిశగా పోలీసు అధికారులు చర్యలు చేపట్టడం అభినందనీయం. కానీ పోలీస్‌స్టేషన్‌లలో సామాన్యులకు ఎదురయ్యే ఇబ్బందులు, కింది స్థాయి సిబ్బంది పనితీరు మెరుగుపడాల్సిన అవసరం ఉందని అంటున్నాడు సగటు పౌరుడు.

ఇవీ చూడండి: నిజాం కాలంనాటి ఫిల్టర్​బెడ్​ను పట్టించుకోండి...!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details