సుర్యాపేట జిల్లా టేకుమట్ల గ్రామానికి చెందిన ఎలిజెర్ల సతీశ్, సరిత గత కొంతకాలం ప్రేమించుకున్నారు. వీరి కులాలు వేరు కావడం వల్ల యువకుడి బంధువులు పెళ్లికి నిరాకరించారు. అమ్మాయి తల్లిదండ్రులు వేరొకరితో పెళ్లి జరిపించారు. సజావుగా సాగుతున్న వారి సంసారంలోకి మాజీ ప్రేమికుడొచ్చాడు. ఇద్దరిని ఎలాగైనా విడదీయాలని గతంలో ఇద్దరు కలిసి దిగిన ఫోటోలు ఆమె భర్తకు పంపించాడు. ఇంకేముంది పెళ్లైన నెలరోజులకే... భార్యాభర్తలు విడాకులు తీసుకున్నారు. యువతికి జరిగిన అన్యాయాన్ని గమనించిన గ్రామపెద్దలు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని మాజీ ప్రేమికుడికి సూచించారు.
ఆ తర్వాత ఇలా జరిగింది..
సీన్ కట్ చేస్తే.. పెద్దల తీర్పు ప్రకారం పెళ్లి జరగాల్సి ఉండగా.. ప్రియురాలి కులం వేరంటూ.. సన్నాయి నొక్కులు నొక్కుతూ.. తప్పించుకునేందుకు ఎత్తులు వేశాడు. అమ్మాయిని అడ్డు తొలగించుకునేందుకు చావు పరీక్ష పెట్టాడు. తనపై ప్రేమ ఉంటే ఇద్దరం ఆత్మహత్య చేసుకుందామని నమ్మించాడు. ప్రియుడి మాటలు నమ్మిన యువతి ముందుగా పురుగుమందు తాగింది. తర్వాత తాను నోట్లో పోసుకున్న ప్రియుడు క్షణాల్లోనే కక్కేశాడు. అక్కడి నుంచి జారుకునే ప్రయత్నం చేశాడు. స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్లాలి నాన్న!