ధూల్ పేట్...హైదరాబాద్ పాత నగరంలో ఒక నాటి గుడుంబా తయారీకి ప్రధాన స్థావరం. ప్రభుత్వం, ఎక్సైజ్ శాఖలు సమన్వయంతో రూపొందించిన వ్యూహాలకు గుడుంబా తయారీ సమూలంగా తుడిచిపెట్టుకుపోయింది. గుడుంబాను నమ్ముకుని జీవనం కొనసాగిస్తూ వచ్చిన కుటుంబాలు ప్రత్యామ్నాయంగా ఉపాధి కరవై గంజాయి విక్రయాల వైపు దృష్టిపెట్టడం అధికారులను కలవరపెడుతోంది.
'ఆపరేషన్ గంజాయి'
ఒకప్పుడు ఆపరేషన్ గుడుంబా చేపట్టి విముక్తి కలిగించిన ఎక్సైజ్ శాఖ మరోసారి ఆపరేషన్ గంజాయి వైపు వేగంగా పావులు కదుపుతోంది. ప్రస్తుతం ధూల్ పేట్లోనే కాకుండా నగరం వ్యాప్తంగా, శివారు ప్రాంతాల్లో ఈ గంజాయి దందా జోరుగా కొనసాగుతోంది.
'దూల్పేట్ మీద 24 గంటల నిఘా'
హైదరాబాద్ దూల్ పేట మీద 24 గంటల నిఘా పెట్టి ఉంచడం వల్ల ఇప్పటి వరకు సుమారు 900 కు పైగా గంజాయి కేసులు నమోదైనట్లు రికార్డులు చెబుతున్నాయి. గంజాయి స్మగ్లింగ్, రవాణా, అమ్మకాలు కొనసాగిస్తూ పట్టుబడిన వందకుపైగా నిందితులను ఆర్టీవో ముందు బైండోవర్ చేశారు. ఎన్నిసార్లు పట్టుబడుతున్నా తిరిగి అదే అక్రమ వ్యాపారం కొనసాగిస్తున్న పదిమంది నిందితులపై పీడీ చట్టం ప్రయోగించారు. ఏడాది చొప్పున జైలుకు పరిమితం చేస్తుండటం వల్ల దూల్ పేట్లో గంజాయి కార్యకలాపాలు అదుపులోకి వచ్చాయి. 10 గ్రాముల, 20 గ్రాముల నుంచి మొదలుకుని 100 గ్రాముల చొప్పున చెట్ల రూపంలో గంజాయిని ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నారు.
'పట్టుబడిన వారి కుటుంబాలకు కౌన్సిలింగ్'
రాత్రి పూట ఖరీదైన బైకులు, కార్లలో విద్యార్థులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు గంజాయి తీసుకెళ్తుంటారు. సుమారు 1500 మంది వరకు విద్యార్థులు ఐటీ ఉద్యోగుల్ని ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకుని వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు.
'సవాల్‌గా మారిన అక్రమ గంజాయి నిర్మూలన'
శివారు ప్రాంతాల్లోని ఇంజనీరింగ్ కళాశాలలు, ఐటీ ఉద్యోగులకు విక్రేతల ఫోన్ , వాట్సాప్ నెంబర్ ఇచ్చి హైటెక్ పద్ధతిలో కొనసాగిస్తున్నట్లు బయటపడింది. లాభసాటి వ్యాపారం కావడం వల్ల పెద్ద మెుత్తంలో ఈ గంజాయి విక్రయాల వైపు ఆసక్తి కనబరుస్తున్నారు. రోజుకో కొత్త కోణం బయటపడుతున్న తరుణంలో అరకొర సిబ్బందితో అక్రమ గంజాయిని అరికట్టడం ఎక్సైజ్ పోలీసులకు సవాల్‌గా మారింది.
ధూల్‌పేట్ ప్రయాణం.. గుడుంబా నుంచి గంజాయి వైపు - ILLEGAL CANNABIS TRANSPORTATION
గుడుంబాను నమ్ముకుని జీవనం కొనసాగిస్తూ వచ్చిన కుటుంబాలు ఇప్పుడు గంజాయి విక్రయాల వైపు దృష్టిపెట్టాయి. ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఉపాధి కల్పిస్తున్నా పూర్తి స్థాయిలో అమలు జరగట్లేదు. దీని వల్ల ఈ అక్రమ వ్యాపారాన్ని పూర్తిగా నివారించడం అధికారులకు సవాల్‌గా మారింది.
ఉపాధి కరవై గంజాయి విక్రయాల వైపు దృష్టి
ఇవీ చూడండి : అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత