ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు జిల్లాసుపత్రి వద్ద ఓ వృద్ధుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన స్థానికులు వృద్ధుడిని కాపాడారు. ఆత్మకూరుకు చెందిన మేకల ఆనందరావుకి ఎవరూ లేరు. దానికి తోడు గత కొంతకాలంగా కాలు, చేయి పనిచేయడం లేదు. వయసు కూడా 62 ఏళ్లు రావటం వల్ల వికలాంగుల పింఛన్ ఇప్పించవలసిందిగా అధికారులను కోరాగా... ఆసుపత్రిలో వికలాంగుల సర్టిఫికేట్ తీసుకురావల్సిందిగా అధికారులు వివరించారు.
పింఛను కోసం వృద్ధుడి ఆత్మహత్యాయత్నం
ఆ వృద్ధుడికి ఒక కాలు, చేయి పనిచేయవు. నా అనుకున్నవారు ఎవ్వరూ లేరు. అలాంటి వ్యక్తి గత 8 నెలలుగా వికలాంగుల సర్టిఫికేట్ కోసం ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్నాడు. అతని స్థితిని చూసి జాలిపడాల్సిన అధికారులు... రేపు మాపు అంటూ తిప్పుతూనే ఉన్నారు. ఇక చేసేదేమి లేక... చూసే దిక్కులేక మనస్థాపానికి గురయ్యాడు. ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రిలోనే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు.
ఈమేరకు గత 8 నెలల కిందట 'మీ సేవ'లో వికలాంగుల సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేశాడు. అప్పటినుంచి కాళ్లు అరిగేలా ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి ఎన్ని సార్లు వెళ్లిన అధికారులు పట్టించుకోలేదు. కొన్ని రోజులు ఇక్కడ సిబ్బంది లేరని అధికారులు కాలం వెళ్లదీశారు. ఆ తర్వాత మూడు నెలలపాటు లాక్డౌన్లో సర్టిఫికెట్లు మంజూరు చేయబోమని చెప్పారు. చివరకు ఇక్కడ సిబ్బంది లేరంటూ ఆ వృద్ధుడి దరఖాస్తును గూడూరు ఆసుపత్రికి ట్రాన్స్ఫర్ పెట్టారు. ఆ విషయం తెలిసిన వృద్ధుడు ఏమి చేయాలో అర్థం కాక పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. తనకంటూ ఎవరూ లేరని అధికారుల చుట్టూ తిరిగేందుకు ఇంకా ఓపిక కూడా లేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.