ఐఐటీ ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో తెలుగు విద్యార్థులు జయ కేతనం ఎగరవేశారు. జాతీయ స్థాయిలో మొదటి 15 ర్యాంకుల్లో ముగ్గురు తెలుగు తేజాలు ఉన్నారు. ఆర్థికంగా వెనకబడిన విభాగంలో అగ్రస్థానం దక్కింది. తొలి వంద ర్యాంకుల్లో సుమారు పాతిక పైగా విద్యార్థులు ఏపీ, తెలంగాణ నుంచి ఉన్నట్లు తెలుస్తోంది.
ఐఐటీ ప్రవేశ ఫలితాల్లో మెరిసిన తెలుగు తేజాలు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌కు చెందిన జి.ఆకాశ్ రెడ్డి జాతీయ స్థాయిలో నాలుగో ర్యాంకుతో మొదటి స్థానంలో నిలిచారు. నెల్లూరుకు చెందిన బి. కార్తికేయకు జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్‌లలో ఐదో ర్యాంకు దక్కింది. జేఈఈ మెయిన్‌లో 25వ ర్యాంకు సాధించిన గుంపర్తి సూర్య లిఖిత్... జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో జాతీయ స్థాయిలో 13వ ర్యాంకు సాధించారు. ఈ ఏడాది కొత్తగా ప్రవేశపెట్టిన ఆర్థికంగా వెనకబడిన వర్గాల... ఈడబ్ల్యూఎస్ కేటగిరిలో తెలుగు విద్యార్థి డి. చంద్రశేఖర దేశంలోనే మొదటి స్థానంలో నిలిచారు. సూరపనేని విజ్ఞ జాతీయ స్థాయిలో 44వ ర్యాంకు సాధించి... బాలికల విభాంగంలో తెలుగు రాష్ట్రాల్లో అగ్రస్థానంలో నిలిచింది.
జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకుల ఆధారంగా దేశంలోని 23 ఐఐటీల్లో సుమారు 11వేల 279 సీట్లను భర్తీ చేయనున్నారు. ఈ ఏడాది లక్షా 61 వేల 319 మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్ రాయగా... 38 వేల 705 మంది ఉత్తీర్ణత సాధించారు. వారిలో అమ్మాయిలు 5 వేల 356 మంది కాగా.. అబ్బాయిలు 33 వేల 349 మంది ఉన్నారు. జనరల్ కేటగిరీలో 15 వేల 566... జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 3వేల 636, ఓబీసీ విభాగంలో 7 వేల 651, ఎస్సీలో 8వేల 758, ఎస్టీలో 3 వేల 94 మంది ఉత్తీర్ణులయ్యారు. జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్ష నిర్వహించిన ఐఐటీ రూర్కీ... శుక్రవారం ఉదయం 10 గంటలకు ఫలితాలను ప్రకటించింది. అయితే ఒక్కసారిగా విద్యార్థులు ఫలితాలు చూసుకునేందుకు ప్రయత్నించడం వల్ల వెబ్సైట్ మొరాయించింది.
ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం శనివారం సాయంత్రం 5 గంటల్లోపు ఆప్టిట్యూడ్ టెస్ట్‌కు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జేఈఈ అడ్వాన్స్ కార్యనిర్వాహక ఛైర్మన్ తెలిపారు. హైదరాబాద్, బొంబాయి, దిల్లీ, గువహటి, కాన్పూర్, ఖరగ్‌పూర్, రూర్కీ ఐఐటీల్లో ఏఏటీ కేంద్రాలు ఉంటాయన్నారు.
ఇవీ చూడండి: 'వాళ్ల కోసమే కాళేశ్వరం నిర్మాణ వ్యయం పెంచారు'