32 జడ్పీ స్థానాల్లో జెండా ఎగురవేసిన తెరాస అత్యధిక మండల పరిషత్‌లను కైవసం చేసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి అదే తరహాలో జిల్లా పరిషత్‌లను గంపగుత్తగా గెలుచుకుంది. రాష్ట్రంలోని 32 జడ్పీ స్థానాల్లో ఏకగ్రీవంగా ఎన్నికై గులాబీ జెండాను ఎగురవేసింది. వరంగల్ గ్రామీణ జిల్లాకు గండ్ర జ్యోతి, ములుగుకు కుసుమ జగదీష్, జనగామకు సంపత్ రెడ్డి, వరంగల్ అర్బన్ నుంచి మారెపల్లి సుధీర్ కుమార్, జయశంకర్ భూపాలపల్లి నుంచి జక్కు శ్రీహర్షిణి ఎన్నికయ్యారు.
కుమురం భీం ఆసిఫాబాద్ జడ్పీ ఛైర్ పర్సన్ మాజీ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, నిర్మల్ జిల్లాకు కె.విజయలక్ష్మి, మంచిర్యాల జిల్లా పరిషత్‌కు నల్లాల భాగ్యలక్ష్మి ఎన్నికై గులాబీ జెండాను ఎగురవేశారు. పెద్దపల్లి జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు, రాజన్న సిరిసిల్ల జిల్లాకు మంజులా రెడ్డి, జగిత్యాల జడ్పీ స్థానానికి దరిశెట్టి లావణ్య విజయం సాధించారు.
నల్గొండ జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, యాదాద్రి భువనగిరి జడ్పీ పీఠం మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి కుమారుడు ఎలిమినేటి సందీప్ రెడ్డి, సూర్యాపేట జడ్పీ గుజ్జ దీపికకు దక్కాయి. మహబూబ్‌నగర్‌లో మాజీ ఎమ్మెల్యే స్వర్ణ సుధాకర్ రెడ్డి, నాగర్ కర్నూలు జిల్లా పరిషత్‌కు పద్మవతి, వనపర్తికి లోక్ నాథ్ రెడ్డి, జోగులాంబ గద్వాల జిల్లాకు సరిత ఎంపికయ్యారు.
ఖమ్మం జడ్పీ ఛైర్మన్‌గా లింగాల కనకరాజ్, భద్రాద్రి కొత్తగూడం జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే కోరె కనకయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కామారెడ్డి జిల్లా పరిషత్‌కు దఫేదార్ శోభ, మెదక్ జడ్పీకి హేమలత గౌడ్, సిద్ధిపేట జిల్లా పరిషత్‌కు వేలేటి రోజా విజయం సాధించారు. రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్‌గా తీగల అనిత, వికారాబాద్ జడ్పీ ఛైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి, మేడ్చల్ జడ్పీ ఛైర్మన్‌గా శరత్ చంద్రారెడ్డి ఎన్నికయ్యారు.
ఇవీ చూడండి: 'భాజపా నుంచి గెలిచి తెరాసకు ఎలా మద్దతిస్తావు...?'