సర్వోన్నత న్యాయస్థానం న్యాయమూర్తులుగా సుప్రీంకోర్టు కొలీజియం నలుగురి పేర్లు సిఫార్సు చేసింది. జస్టిస్ అనిరుద్దా బోస్, జస్టిస్ ఏఎస్ బోపన్నల పేర్లు మరోసారి ప్రతిపాదించింది. వీరి పదోన్నతులపై కేంద్రం తెలిపిన అభ్యంతరాలను తోసిపుచ్చింది కొలీజియం. సుప్రీం జడ్జీలు కావడానికి వారికి ఉన్న అర్హత, ప్రవర్తన, సమగ్రతలో తమకు ఎలాంటి ప్రతికూలతలు కనిపించలేదని కొలీజియం స్పష్టం చేసింది.
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కొలీజియం బుధవారం సమావేశమైంది. నలుగురు హైకోర్టు న్యాయమూర్తుల పదోన్నతిపై చర్చించింది. నిర్ణయాన్ని సుప్రీం కోర్టు వెబ్సైట్లో గురువారం పొందుపరిచింది.
జస్టిస్ అనిరుద్దా బోస్, జస్టిస్ ఏఎస్ బోపన్నల పేర్లను ఇంతకుముందే కొలీజియం ప్రతిపాదించగా వారి నిజాయతీ, ప్రాంతాల ప్రాతినిధ్యం కారణాలుగా చూపించి కేంద్రం తిప్పి పంపించింది. ఈ అభ్యంతరాలను తోసిపుచ్చిన కొలీజియం పదోన్నతికి యోగ్యతే ప్రధానమని అభిప్రాయపడింది.
జస్టిస్ అనిరుద్దా బోస్ ప్రస్తుతం ఝార్ఖండ్ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు. అఖిల భారత జడ్జీల సీనియారిటీలో 12వ స్థానంలో ఉన్నారు. జస్టిస్ ఏఎస్ బోస్ గువహటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేస్తున్నారు. సీనియారిటీలో 36వ స్థానంలో ఉన్నారు.