బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య నివేదికను దిల్లీ ఎయిమ్స్ ఫోరెన్సిక్ బృందం విశ్లేషించనుంది. పోస్టుమార్టం రిపోర్టుతోపాటు సుశాంత్ శరీరంపై ఉన్న గాయాలను వైద్యపరంగా పరిశోధన జరిపి మెడికో లీగల్ అభిప్రాయాన్ని వెల్లడించనుంది. ఇందుకోసం ఎయిమ్స్ అయిదుగురితో కూడిన వైద్య బృందాన్ని ఏర్పాటు చేసింది. సీబీఐ దర్యాప్తులో భాగంగా ఈ ప్రక్రియను జరుపుతున్నారు. ఈ విషయాన్ని ఆస్పత్రి ఫోరెన్సిక్ విభాగం అధిపతి డాక్టర్ సుధీర్ గుప్తా తెలిపారు.
సుశాంత్ పోస్టుమార్టం నివేదిక, ఘటనా స్థలంలో లభించిన ఆధారాలు, అతడి శరీరంపై గాయాలు, ఇతర అంశాలను విశ్లేషించి నటుడి మరణంపై మెడికో-లీగల్ అభిప్రాయం చెబుతామన్నారు గుప్తా. దీని కోసం ఫోరెన్సిక్ నిఫుణులతో ఒక మెడికల్ బోర్డును కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అన్ని అంశాలు పరిశీలించిన తర్వాతే సుశాంత్ ఎలా చనిపోయాడనే విషయం చెప్పగలమని అన్నారు.