నవమాసాలు మోసి.. పెంచి.. పెద్ద చేసేదే తల్లి. ఇప్పుడు వారికే ఆదరణ కరవైంది. ఆరోగ్యం బాగాలేదని ఒకరు. వయసు మీద పడింది..సేవలు చేసే ఓపిక నాకెక్కడిది అని మరొకరు. ఇలా రక్తం దారబోసిన తల్లిని బయటకు గెంటేస్తున్నారు. అనంతపురం జిల్లా కదిరిలో ఇలాంటి ఘటనే జరిగింది. అర్ధరాత్రి కన్నతల్లిని ఇంటి నుంచి బయటకు పంపేశాడో కుమారుడు.
అనంతపురం జిల్లా కదిరి పట్టణానికి చెందిన బాబులమ్మ ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పని చేసి స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. భర్త మృతి తర్వాత బాబులమ్మ కొడుకు అమీర్ కలిసి పట్టణంలోనే నివాసం ఉంటున్నారు. అమీర్‌కు పంచాయతీరాజ్ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం వచ్చింది. అమీర్ భార్య ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. వయసు మీద పడటంతో ఎవరు సాకాలనే సాకుతో గతంలో కర్ణాటకలోని ఓ వృద్ధాశ్రమంలో వదిలి వచ్చారు బాబులమ్మను. కొడుకు మీద మమకారంతో అక్కడ ఉండలేక తిరిగి వచ్చేసింది ఆ తల్లి. గత రాత్రి ఇంటి నుంచి పంపేయాలనుకున్న కొడుకు ఆటోడ్రైవర్‌ను పిలిపించాడు. బస్టాండ్‌లో వదిలేయలంటూ చెప్పడంతో ఒక్కసారిగా ఆ తల్లి మనసు చివుకుమంది. కాలు, చేయి కదపలేని తాను ఈ సమయంలో ఎక్కడికి వెళ్లాలి నాన్న అంటూ వేడుకున్న కొడుకు కనికరించలేదు. కష్టపడి ఇంత పెద్దవాడిని చేస్తే...కొడుకు నడిరోడ్డుపై వదిలేస్తున్నాడేంటని ఆవేదన చెందింది.