పట్టాలపై గుజ్జర్ల నిరసనలు ప్రభుత్వంతో చర్చలు విఫలమవడం వల్ల గుజ్జర్లు మూడో రోజూ రైలు పట్టాలపైనే బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల అధికారులు దాదాపు 200 రైళ్లలో కొన్నింటిని రద్దు చేసి, మరికొన్నింటిని దారిమళ్లించారు. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో 5 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు గుజ్జర్లు.
గుజ్జర్ ఆరక్షన్ సంఘర్ష్ సమితి అధ్యక్షుడు కిరోరి సింగ్ బైంస్లా ఆధ్వర్యంలో పట్టాలపై బైటాయించారు. బైంస్లా, ఆయన అనుచరులతో పర్యటక మంత్రి విశ్వేంద్ర సింగ్ సహా సీనియర్ ఐఏఎస్ అధికారులు నీరజ్ కే పావన్లు చర్చలు జరిపినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ఆదివారం మరోసారి చర్చలకు రావాలని, రైలు మార్గాలను ఖాళీ చేయాలని పర్యటక మంత్రి నిరసనకారులను కోరారు.
గుజ్జర్లు, రాయిక-రెబరీ, గడియా లుహార్, బంజారా, గడారియా సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో భాజపా హామీ ఇచ్చిందని, దీన్ని సాధించుకునే వరకు వెనక్కి తగ్గబోమని బైంస్లా అన్నారు.
ఆందోళన చేస్తున్న ఐదు సామాజిక వర్గాలు అత్యంత వెనకబడిన వర్గాల కింద ఒక శాతం ప్రత్యేక కోటా పొందుతున్నారు. దీనికి అదనంగా ఓబీసీ రిజర్వేషన్లు కూడ పొందుతున్నారు.