సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌ను లఖ్‌నవూ విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకున్నందుకు నిరసనగా రాజ్యసభలో ఆందోళన చేశారు ఆ పార్టీ ఎంపీలు. ఎస్పీ సభ్యుల నిరసనలతో రాజ్యసభ రేపటికి వాయిదా పడింది.
రాజ్యసభను కుదిపేసిన అఖిలేశ్ అడ్డగింత
అఖిలేశ్ యాదవ్‌ను లఖ్‌నవూ విమానాశ్రయంలో అడ్డగించిన ఘటనపై రాజ్యసభ అట్టుడికింది. సభ రేపటికి వాయిదా పడింది.
అలహాబాద్ విశ్వవిద్యాలయంలో విద్యార్థి నాయకుడి ప్రమాణస్వీకారానికి వెళ్తుండగా విమానాశ్రయంలో అఖిలేష్‌ను పోలీసులు అడ్డుకున్నారు.
అఖిలేశ్ అడ్డగింతపై చర్చించాలని సభ ప్రారంభం నుంచే సమాజ్‌వాదీ పార్టీ ఎంపీలు డిమాండ్ చేశారు. అందుకు సభాపతి వెంకయ్యనాయుడు అనుమతించలేదు. ఈ అంశంపై నోటీసులు ఇవ్వనందున చర్చకు అనుమతించలేనని వెంకయ్య తేల్చిచెప్పారు. శూన్యకాల తీర్మానంలో ప్రజా ప్రయోజన అంశాలపై చర్చించాలని సభ్యులకు సూచించారు. అయినా సభ్యులు వెనక్కి తగ్గకపోవడం వల్ల మధ్యాహ్నం 2 గంటల వరకు సభను వాయిదా వేశారు.
మధ్యాహ్నం 2 గంటలకు సభ తిరిగి ప్రారంభమైనప్పటికీ ఎస్పీ, బహుజన్ సమాజ్‌వాదీ, తృణమూల్ కాంగ్రెస్, రాష్ట్రీయ జనతా దల్ పార్టీల సభ్యులు అఖిలేష్ అంశంపై చర్చించాలని పట్టుబట్టారు. దీంతో మరోమారు అరగంట పాటు సభను వాయిదా వేశారు వెంకయ్య. ఆ తర్వాత కూడా సభ్యులు ఆందోళనలు విరమించకపోవడం వల్ల సభను రేపటికి వాయిదా వేశారు.