రాజ్యసభ ముందుకు రాని పౌరసత్వ బిల్లు పౌరసత్వ చట్ట సవరణ బిల్లు, ముమ్మారు తలాక్ బిల్లులకు పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోనూ ఆమోదం లభించలేదు. బడ్జెట్ సమావేశాల్లో చివరిరోజైన బుధవారం కూడా రాజ్యసభలో ఈ రెండు బిల్లులను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రస్తుత ప్రభుత్వానికి ఇవే చివరి సమావేశాలు కాగా, ఈ బిల్లులు వీగిపోనున్నాయి.
పౌరసత్వ సవరణ బిల్లు ఏంటి..
బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ దేశాల నుంచి వచ్చి భారతదేశంలో ఏడు సంవత్సరాల నుంచి నివాసమున్న హిందువులు, జైనులు, క్రైస్తవులు, సిక్కులు, బుద్ధులు, పార్శీలకు భారతీయ పౌరసత్వం ఇవ్వొచ్చని చెబుతోంది ఈ సవరణ బిల్లు. ప్రస్తుతం ఆ సమయం 12 సంవత్సరాలుగా ఉంది.
గతనెల 8న శీతకాల పార్లమెంటు సమావేశాల్లోనే లోక్సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు రాజ్యసభలో పెండింగ్లో ఉంది.
ముమ్మారు తలాక్...
ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ బిల్లు-2018 ప్రకారం, తక్షణ, ముమ్మారు తలాక్ చెప్పడం చట్ట విరుద్ధం, అలా చేసిన భర్తకు మూడేళ్ల వరకు కారాగార శిక్ష విధించవచ్చు. ఒకేసారి ముమ్మారు తలాక్ చెప్పి విడాకులిచ్చే పద్ధతిని నిషేధించే అత్యవసరాదేశం (ఆర్డినెన్సు) స్థానంలో ప్రవేశపెట్టిందే ముమ్మారు తలాక్ బిల్లు.
ఇదివరకే లోక్‌సభ ఆమోదం తెలిపింది. అయినా రాజ్యసభ ముందుకు ఈ బిల్లు రాలేదు.