ఏ మనిషి అయినా రోజూ కష్టపడేది పట్టెడన్నం కోసమే. అలాంటిది ఉదయమే వెళ్లి రోజంతా కష్టపడుతున్న ఓట్ల లెక్కింపు సిబ్బందికి సరైన అన్నం కూడా పెట్టట్లేదు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం కౌంటింగ్ కేంద్రానికి ఉదయం 6 గంటల వరకే చేరుకున్న సిబ్బందికి కనీసం టీ, టిఫిన్ కూడా అందించలేరు. పోనీలే మధ్యాహ్నమైనా ఆకలి తీర్చుకుందాం అనుకుంటే నిరాశే ఎదురైంది. ఎంతో ఆకలితో వచ్చిన వారికి నీళ్ల లాంటి కూర, కారం నీళ్లు కలిపి పోసినట్లుగా ఉన్న సాంబారే దిక్కైంది. ఇవన్నీ చూసిన సిబ్బంది భోజనం సరిగా లేదంటూ నిరసన వ్యక్తం చేశారు.
కడుపు మాడ్చుకోలేక కొందరు సిబ్బంది నీళ్ల చారు, ఉడకని ఆలుగడ్డ కూరనే తిన్నారు. అసలు ఇలాంటి భోజనాన్ని ఎవరూ తినరని, తామిప్పుడు ఆకలికి ఆగలేకనే తింటున్నట్లు తెలిపారు.