హైతీ అధ్యక్షుడు జావెనెల్ మోయిస్ రాజీనామా చేయాలని ఆ దేశ ప్రజలు పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. రాజధాని నగరం పోర్ట్ఏప్రిన్స్లో భారీ ర్యాలీలు నిర్వహించారు. పలుచోట్ల రోడ్లపై టైర్లకు నిప్పంటించారు. పలు వాహనాలను ధ్వంసం చేశారు.
సోమవారం, మంగళవారం హైతీ వ్యాప్తంగా జరిగిన సమ్మెకు కొనసాగింపుగా శుక్రవారం ర్యాలీ నిర్వహించారు ప్రజలు.
వెనిజువెలా నుంచి రాయితితో సరఫరా చేసుకున్న చమురుకు నిధులు కేటాయింపులో భారీ అవినీతి జరిగినట్లు ఆరోపణలొచ్చాయి. ఈ విషయంపై సెనేట్ విచారణ జరిపింది. గత ప్రభుత్వ అధికారులు 3.8 బిలియన్ డాలర్ల దుర్వినియోగానికి పాల్పడినట్లు తేల్చింది. ప్రస్తుత ప్రభుత్వ అధికారులూ అవినీతికి పాల్పడుతున్నట్లు ఇటీవలే ఓ నివేదిక విడుదలైంది.