ఎండ కొడుతోంది... విద్యుత్ వినియోగం పెరుగుతోంది రాష్ట్రంలో వాతావరణం రోజురోజుకు వేడెక్కిపోతోంది. భానుడి ప్రతాపానికి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికే భయపడుతున్నారు. ఒక్కసారిగా పెరిగిన ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. ఉక్కపోత నుంచి ఉపశమనం పొందడానికి ఏసీ, కూలర్, ఫ్యాన్లపై ఆధారపడుతున్నారు. ఇది విద్యుత్ వినియోగంపై ప్రభావం చూపెడుతోంది.
రాష్ట్రంలో ఈరోజు రికార్డు స్థాయిలో 8వేల 391 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరిగింది. గతేడాది మే 28న 7వేల 376 మెగావాట్లు వినియోగిస్తే ఈ ఏడాది అదే రోజు 1 వేయి 170 మెగావాట్లు అధికంగా వినియోగం జరిగింది.
పెద్దపల్లి జిల్లాలో ఇవాళ 47.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో 45 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైనట్లు చెప్పారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవ్వడం వల్ల ఈరోజు 8,391 మెగావాట్ల అత్యధిక విద్యుత్ వినియోగం జరిగిందని విద్యుత్ శాఖ అధికారులు పేర్కొన్నారు.
ఎస్.పీ.డీ.సీ.ఎల్ పరిధిలో 6,170 మెగావాట్లు, ఎన్.పీ.డీ.సీ.ఎల్ పరిధిలో 2,021 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరిగింది. ఇక గ్రేటర్లో ఈరోజు రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం జరిగిందని విద్యుత్ శాఖ తెలిపింది. ఈనెల 20న 3,150 మెగావాట్ల అత్యధిక విద్యుత్ వినియోగం నమోదైంది. ఎండ వేడిమిని భరించలేక ఇళ్లు, కార్యాలయాల్లో... ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల వినియోగం పెరిగినట్లు డిస్కంల పరిశీలనలో వెల్లడైంది.
ఇదీ చూడండి : బయో డీజిల్ డీలర్ షిప్ పేరుతో ఘరానా మోసం