ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. రఫేల్ ఒప్పందంలో ప్రధాని కార్యాలయమే నేరుగా ఫ్రాన్స్ ప్రభుత్వంతో చర్చలు జరిపిందన్నారు. ఈ కుంభకోణంలో మోదీ ప్రధాన నిందితుడని ఆరోపించారు.
రఫేల్ కుంభకోణం తెరిచి మూసేసిన కేసుగా రాహుల్ అభివర్ణించారు. రఫేల్ ఒప్పందంపై భారత్, ఫ్రాన్స్ మధ్య చర్చల సమయంలో ప్రధానమంత్రి కార్యాలయం సమాంతర చర్చలు జరుపడంపై రక్షణ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసిందని ఓ పత్రిక కథనం ప్రచురించింది. దానిపై స్పందిస్తూ రాహుల్ మరోసారి రఫేల్ విమర్శలు చేశారు.
రఫేల్ ఒప్పందంలో పీఎంఓ హస్తం ఉందని రాహుల్ గాంధీ ఆరోపణ
" ఈ దేశంలోని ప్రతి ఒక్క సైనికుడితో నేను మాట్లాడాలనుకుంటున్నా. మీకు చెందిన డబ్బును ప్రధానమంత్రి దొంగతనం చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఒప్పందాన్ని తప్పుతోవపట్టించి ఆయన స్నేహితుడు అనిల్ అంబానీకి రూ.30 వేల కోట్లను దోచి పెట్టారు. ఫ్రాన్స్ ప్రభుత్వంతో రక్షణ శాఖ, భారత సంధానకర్తల బృందం చేపట్టిన చర్చలను బలహీనపరుస్తూ ప్రధాని కార్యాలయం సమాంతర చర్చలు చేపట్టిందని రక్షణ శాఖ స్పష్టంగా తెలిపింది. "- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షులు
రఫేల్ యుద్ధవిమానాలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ విచారణ చేపట్టాలని రాహుల్ డిమాండ్ చేశారు.