తెలంగాణ

telangana

ETV Bharat / briefs

కదం తొక్కుతున్న కూటమి... కలవరపెడుతున్న ఓటమి - ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి చంద్రబాబు

కొద్ది నెలల్లోనే రాజకీయం ఎందుకు మారిపోయింది? నలభై ఏళ్ల తర్వాత సొంతంగా హస్తినపై జెండా ఎగరేయగలిగిన స్థాయిలో నిలిచిన భాజపా పరిస్థితి ఎందుకు సంక్లిష్టమైంది? అప్రతిహత విజయాలతో దూసుకెళుతున్న కమలదళాన్ని కలవరపెట్టగల స్థాయికి.. విపక్ష కూటమి ఎలా రాగలిగింది?

ప్రతిపక్షాల బలం... భాజపా భయం

By

Published : Feb 9, 2019, 9:07 AM IST

Updated : Feb 9, 2019, 12:20 PM IST

సార్వత్రిక ఎన్నికల ముందు జాతీయ రాజకీయాల దశ, దిశపై ఈటీవీ భారత్​ అందిస్తున్న విశ్లేషణాత్మక కథనాల సమాహారంలోని మొదటిది ఇది.

కూటమి ఐకమత్యం.. భాజపాకు కలవరం

సమాహారంలో రెండో కథనం : కూటమికి కింగా, క్వీనా?

సార్వత్రిక ఎన్నికల ముంగిట.. విపక్ష కూటమి అనూహ్యంగా పుంజుకుంది. గత ఎన్నికల్లో తిరుగులేని రీతిలో ఓట్లు, సీట్లు సాధించి.. దూసుకెళుతున్న కాషాయదండును కలవరపెడుతోంది. భాజపాకు వ్యతిరేకంగా వివిధ పార్టీల నాయకుల మధ్య ఐక్యత మరింత పెరుగుతోంది. కాంగ్రెస్​ పెద్దన్న బాధ్యతలో పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కృషి చేస్తోంది. రాష్ట్రాల హక్కులను కమలదళం కాలరాస్తోందన్న ఆవేదనే ప్రతిపక్షాల ఐక్యతకు పెద్ద ఊతంగా నిలుస్తోంది. కోల్​కతా ఐక్యతా ర్యాలీ మరింత ఉత్సాహం తెచ్చింది. ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి చంద్రబాబు, బంగాల్​ సీఎం మమతా బెనర్జీలో కూటమిలో క్రియాశీలకంగా మారుతున్నారు.

బలోపేతం దిశగా..

ప్రస్తుత పరిస్థితుల్లో భాజపాను ఒంటరిగా ఎదుర్కోలేమనే ఉద్దేశంతో.... ప్రతిపక్షాల కూటమి ఆలోచనకు బీజం వేసింది కాంగ్రెస్​. అందుకు తగ్గట్టుగా కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ అన్ని పార్టీలను కలుపుకుపోయేందుకు సిద్ధంగా ఉన్నామంటూ సంకేతాలు పంపారు. పాత మిత్రులను కలుపుకునేందుకు శ్రమించారు. భాజపాకు వ్యతిరేకంగా పోరాడుతున్న పశ్చిమ్​ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపక్ష కూటమివైపై మొగ్గు చూపడం వల్ల మరింత బలం చేకూరింది.

చంద్రబాబు రాకతో...

ప్రతిపక్షాలను కలుపుకుపోతే భాజపాను ఢీకొట్టగలమే భావన అందరిలో ఉన్నా.. ఏదో ఓ మూల సందేహం. పార్టీలు చివరి వరకు ఐక్యంగా ఉంటాయా అని. కానీ ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాకతో పరిస్థితి మారిపోయింది. ఏపీకి అన్యాయం చేస్తున్నారనే కారణంగా భాజపా నుంచి విడిపోయి, కేంద్ర మంత్రివర్గం​ నుంచి వైదొలిగి ప్రతిపక్షాల కూటమికి మద్దతు తెలిపారు చంద్రబాబు.

కూటమిలో చేరికతో సరిపెట్టలేదు బాబు. దేశవ్యాప్తంగా అప్పటివరకు ఎవరికి వారే అన్నట్లు ఉన్న విపక్షాల్ని ఏకం చేసేందుకు తనవంతు శ్రమించారు. ఆయన కృషి ఫలించింది. పార్లమెంటు శీతాకాల సమావేశాలకు ఒక రోజు ముందు దిల్లీలో చంద్రబాబు నేతృత్వంలో జరిగిన విపక్షాల భేటీయే ఇందుకు నిదర్శనం. ఆ సమావేశానికి 14 పార్టీల అగ్రనేతలు హాజరయ్యారు. కోల్​కతా ర్యాలీ సమయానికి ఆ సంఖ్య 23కి చేరింది. కాంగ్రెస్​, తృణమూల్​ కాంగ్రెస్, తెదేపా, జేడీఎస్​, డీఎంకే, సీపీఐ, సీపీఎం, ఆమ్​ఆద్మీ, ఎన్సీపీ, నేషనల్​ కాంగ్రెస్​ వంటి ప్రాంతీయ పార్టీలు ర్యాలీలో భాగస్వాములయ్యాయి.

అందరినీ కలిపింది సమాఖ్యస్ఫూర్తి....

భాజపా పాలనలో రాష్ట్రాల హక్కులకు భంగం వాటిల్లిందని ప్రాంతీయ పార్టీలన్నీ భావిస్తున్నాయి. సమాఖ్యస్ఫూర్తికి భాజపా నేతృత్వంలోని కేంద్రం తూట్లు పొడుస్తోందన్నది ఆయా పార్టీ ఆవేదన. ఈ భావన పార్టీల ఐక్యతను మరింత పటిష్ఠం చేస్తోంది. రాష్ట్రాలపై సీబీఐ, ఐటీ వంటి సంస్థలను ఉసిగొలుపుతోందనే ఆగ్రహమూ పెరిగిపోయింది.

కేసులతో కొందరిలో భయం..భయం

ప్రతిపక్షాల ఐక్యత పెరిగిపోతోందని భావించిన భాజపా...కేసులతో కొందరిని భయపెడుతోందని ఆరోపిస్తున్నారు విపక్ష నేతలు. సమాజ్​వాదీ పార్టీ అధినేత అఖిలేశ్​ మెడకు ఇసుక అక్రమ తవ్వకాల కేసు చుట్టుకుంది. ఈ కేసు విచారణలో సీబీఐ దూకుడు పెంచింది. అఖిలేశ్​నే విచారిస్తామని ప్రకటనలు చేస్తోంది.

బీఎస్పీ అధినేత్రి మాయావతిపైనా అవినీతి కేసులు నడుస్తున్నాయి. మాయావతి కూడా ప్రతిపక్ష కూటమికి దూరం జరిగారు. ఉత్తరప్రదేశ్​లోనూ కాంగ్రెస్​తో తెగదెంపులు చేసుకున్నారు. రాష్ట్రంలో ఎస్పీ, బీఎస్పీ కూటమి ఉంటుందని ప్రకటించారు.

దేశాన్ని ఏకతా స్ఫూర్తితో నిలుపుతామని.. ప్రధాని నరేంద్రమోదీ పలు సందర్భాల్లో చెబుతుంటారు. అది ఎంత వరకూ సాధ్యమైందో తెలీదు కానీ... ప్రతిపక్షాలన్నీ ఏకం కావడానికి మాత్రం మోదీనే కారణం. మరి.. మోదీపై వ్యతిరేకతో.. అధికారంలోకి రావలసిన అనివార్యతో కానీ.. ఎన్నికల ముంగిట మాత్రం అన్ని పక్షాలు ఏకతా రాగాన్ని ఆలపిస్తున్నాయి.

Last Updated : Feb 9, 2019, 12:20 PM IST

ABOUT THE AUTHOR

...view details