జమ్ముకశ్మీర్ పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై 'జైష్ ఏ మహమ్మద్' జరిపిన ఉగ్రదాడిని అమెరికా తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు ఏకమై పోరాడాలని, ఉగ్రవాదులకు ఏ కోశంలోనూ మద్దతు ఇవ్వకూడదని అగ్రరాజ్యం పిలుపునిచ్చింది.
మూడు దశాబ్దాల క్రితం పాకిస్థాన్లో వెలసిన జైష్ ఏ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఈ పిరికిపంద చర్యకు పాల్పడింది. ఆ సంస్థకు చెందిన ఆత్మాహుతిదళ సభ్యుడు పేలుడు పదార్ధాలు ఉన్న వాహనంతో వెళ్లి సీఆర్పీఎఫ్ జవానుల వాహనాన్ని ఢీకొనడం వల్ల సుమారు 40 మంది జవానులు మరణించారు. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఉగ్రదాడిని ఖండించిన అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ఉగ్రవాద నిర్మూలనకు భారత్తో కలిసి పనిచేస్తామని స్పష్టంచేసింది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని అంతమొందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.
'జమ్ముకశ్మీర్ పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తున్నాం. అమరులైన భారత జవాన్లకు నివాళి అర్పిస్తున్నాం, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నాం.'
-రాబర్ట్ పల్లాడినో, అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ డిప్యూటీ అధికార ప్రతినిధి