అన్ని దినోత్సవాల్లాగే అమ్మను పూజించడానికి కూడా ఓ రోజంటూ ఉంది. అదే అంతర్జాతీయ మాతృదినోత్సవం. మన దేశంలో మే నెల రెండో ఆదివారం మాతృదినోత్సవంగా నిర్ణయించారు. తల్లిదండ్రుల పట్ల ప్రేమ, వాత్సల్యం, ఆప్యాయత, అనురాగం చూపించడంలో కొడుకుల కంటే కుమార్తెలే ముందుంటారనేది ఎవరూ కాదనలేని వాస్తవం.
కూతురికి పెళ్లి చేసి ఎంతో కష్టంగా, మనసును రాయి చేసుకొని అత్తారింటికి పంపుతుంది. తన బిడ్డకు పిల్లలు పుట్టినా... ఆ అమ్మకి మాత్రం తన కూతురు చిన్నపిల్లలాగే కనిపిస్తుంది. అలాగే ముద్దు చేస్తుంది. చనిపోయే వరకు తన పిల్లలే లోకంగా జీవిస్తుంది. కూతురు కూడా అంతే తను ఎంతో గారాబంగా పెరిగి మెట్టినింటికి వస్తుంది. తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల ప్రేమకు దూరంగా ఉంటూ బాధపడుతూనే ఉంటుంది.