ఇటీవలి కాలంలో చాలా మంది యువత, చిన్నారులు వాడుతున్న వీడియో షేరింగ్ మొబైల్ యాప్ 'టిక్‌టాక్'ను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది మద్రాస్ హైకోర్టు. ఈ యాప్ వల్ల అశ్లీల, అభ్యంతర దృశ్యాలు వ్యాప్తి అవుతున్నాయని, అవి సమాజంపై చెడు ప్రభావాన్ని చూపిస్తున్నాయని అభిప్రాయపడింది జస్టిస్ ఎన్.కిరుబకరణ్, జస్టిస్ ఎస్.ఎస్.సుందర్‌లతో కూడిన హైకోర్టు ధర్మాసనం.
సంస్కృతిని కించపరిచేలా, అశ్లీల దృశ్యాలను వ్యాప్తి చేస్తున్న టిక్‌టాక్‌ను నిషేధించాలని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపిన తర్వాత ఈ ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం. తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది.
మీడియా సంస్థలకూ ఆదేశాలు
టిక్‌టాక్ యాప్‌తో తయారు చేసిన వీడియో క్లిప్పులను ఎట్టి పరిస్థితుల్లో ప్రసారం చేయకూడదని మీడియా సంస్థలను ఆదేశించింది ధర్మాసనం. అదే విధంగా ఇతర యాప్‌ల ద్వారా లభించే అభ్యంతరకర, అశ్లీల చిత్రాలను వినియోగించవద్దని సంస్థలకు సూచించింది.