లోక్‌సభ ఎన్నికల మలిదశ ప్రచారానికి గులాబీ దళపతి సిద్ధమయ్యారు. ఈనెల 29 నుంచి సీఎం కేసీఆర్ నియోజకవర్గాల బాట పట్టనున్నారు. ఏప్రిల్ 4 వరకు 13 బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఇప్పటికే కరీంనగర్, నిజామాబాద్‌లో ప్రచారం పూర్తి చేసిన కేసీఆర్... చివరి నాలుగు రోజులు ఆదిలాబాద్, చేవెళ్ల సభల్లో పాల్గొనాలని భావిస్తున్నారు. రోజు రెండు సభలు
16 లోక్‌సభ స్థానాల్లో విజయమే లక్ష్యంగా... ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో సుడిగాలి ప్రచారానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎండ తీవ్రత కారణంగా రోజూ రెండు సభలు సాయంత్రం వేళల్లో జరపాలని నిర్ణయించారు. సాయంత్రం 4 గంటలకు ఒక సభ... ఐదున్నరకు మరొకటి జరిపేలా ప్రణాళికలు రూపొందించారు. కేసీఆర్ ప్రచారం కోసం హెలికాప్టర్ సిద్ధం చేశారు.
మిర్యాలగూడ నుంచి మలిదశ ప్రచారం
ఈనెల 29న సాయంత్రం 4 గంటలకు మిర్యాలగూడలో నల్గొండ నియోజకవర్గం సభతో కేసీఆర్ మలిదశ ప్రచారం మొదలు కానుంది. అదే రోజు సాయంత్రం ఐదున్నరకు ఎల్బీ స్టేడియంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్ల నియోజకవర్గాలకు ఉమ్మడి సభ నిర్వహించనున్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో కొంత పట్టణ ప్రాంతం.. మరికొన్ని గ్రామీణ ప్రాంతాలు ఉన్నందున... ఏప్రిల్ 8 లేదా 9న మరో సభ కూడా నిర్వహించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు.
ఈనెల 31న సాయంత్రం 4గంటలకు నాగర్ కర్నూలు నియోజకవర్గ సభ వనపర్తిలో నిర్వహిస్తారు. అదే రోజు ఐదున్నరకు మహబూబ్‌నగర్‌లో బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగిస్తారు. ఏప్రిల్ 1 న పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించిన సభను రామగుండంలో ఏర్పాటు చేయనున్నారు.
ఆదిలాబాద్, చేవెళ్లలో రెండు సభలు
ఏప్రిల్ 2న వరంగల్, భువనగిరిలో కేసీఆర్ ప్రచార సభలు ఉంటాయి. ఏప్రిల్ 3న సాయంత్రం 4 గంటలకు జహీరాబాద్ లోక్‌సభ సెగ్మెంటు సభను అందోల్‌లో నిర్వహించనున్నారు. అదే రోజున మెదక్ నియోజకవర్గం సభ నర్సాపూర్‌లో ఏర్పాటు చేయనున్నారు. ఏప్రిల్ 4న మహబూబాబాద్, ఖమ్మం బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొంటారు. చివరి నాలుగు రోజుల్లో ఆదిలాబాద్ నియోజకవర్గంలో రెండు చోట్ల... చేవెళ్ల పరిధిలో మరో సభ నిర్వహించాలని భావిస్తున్నారు.