తెలంగాణ ఏర్పడిన తర్వాత సాగు నీటి రంగానికి కేసీఆర్ సర్కార్ పెద్దపీట వేసింది. బడ్జెట్లోనూ అధిక నిధులు కేటాయించింది. ప్రతీ నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీరందిస్తామని ప్రకటించారు కేసీఆర్... అందుకు తగ్గట్టుగానే ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేశారు. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, సీతారామ, దిండి ఎత్తిపోతల డిజైన్లను మార్చేశారు. బహుళ ప్రయోజనాల దృష్ట్యా.... కాళేశ్వరం ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్, గత ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీశ్ రావు ప్రత్యేక దృష్టి పెట్టి పనుల్ని వేగవంతం చేశారు. నిర్మాణంలో రికార్డులు తిరగరాసుకుంటూ దేశం దృష్టిని ఆకర్షించింది కాళేశ్వరం.
ఏడాదిలోపే..
ఇంజినీరింగ్ సవాళ్లతో కూడుకున్న ఈ ప్రాజెక్టు... ఇటీవల వెట్రన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. పూర్తి భారతీయ సాంకేతికతో నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఫలాలను ఈ ఏడాదిలోనే రైతులకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. జూలైలో కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలను ఎత్తిపోసి జలాశయాలకు తరలించి అక్కణ్నుంచి చెరువులు, పంట పొలాలకు నీరిచ్చేలా పనుల్ని వేగవంతం చేసింది.