ప్రాదేశిక ఎన్నికల పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు అవగాహనతో వ్యవహరించకుంటే.. ఓట్లు చెల్లకుండా పోయే ప్రమాదముంది. బ్యాలెట్ పత్రాలు తీసుకొనే ముందు - కౌంటర్ ఫాయిల్‌పై సంతకం చేయాల్సి ఉంటుంది. నిరక్ష్యరాస్యుల నుంచి వేలిముద్ర తీసుకుంటారు. బొటనవేలుకు అంటిన సిరాను తుడుచుకోకుండా బ్యాలెట్ పత్రాలను పట్టుకుంటే.. వాటిని మడిచేటప్పుడు వేలుకున్న సిరా ఆనవాళ్లు ఆ పేపర్‌పై ఎక్కడో ఓచోట పడవచ్చు. నిబంధనల ప్రకారం పత్రంలోని ఒక అభ్యర్థి గడిలో రబ్బరుస్టాంపు గుర్తు తప్ప, వేరే ఏవైనా ఉంటే వాటిని చెల్లనివాటిగానే పరిగణిస్తారు.
బొటనవేలి సిరా తుడుచుకోవాలి
బొటనవేలిపై సిరాను ఓటరు శుభ్రంగా తుడుచుకోవాలి. అందుకోసం బల్లపై తడి గుడ్డను సిద్ధంగా ఉంచాలని ఎన్నికల సంఘం మార్గదర్శకాలు చెబుతున్నాయి. ఎడమచేతి మధ్యవేలిపై వేసే సిరా గుర్తును మాత్రం చెరపకూడదు. ఓటు వేసి వెళ్లిపోయేటప్పుడు, పోలింగ్ సిబ్బంది అతడి వేలిని చూసి నిర్ధరించుకోవాలని ఈసీ పేర్కొంది.