రైతులను మరచి పెద్దలకు లబ్ది:మోదీపై రాహుల్ ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శనాస్త్రాలకు పదును పెట్టారు. తాజాగా ప్రధాని స్వరాష్ట్రం గుజరాత్‌లోని వల్సాద్‌లో జరిగిన ర్యాలీలో ప్రసంగించారు రాహుల్. రైతుల రుణాలు మాఫీ చేయటాన్ని విస్మరించిన మోదీ... దేశంలోని 15 మంది బడా పారిశ్రామిక వేత్తలకు రూ.3.5లక్షల కోట్ల బకాయిలు మాఫీ చేశారని ఆరోపించారు.
" ప్రధానమంత్రి 15 మంది పారిశ్రామికవేత్తలకు చెందిన రూ.3.5 లక్షల కోట్ల బకాయిలు మాఫీ చేశారు. మరి గుజరాత్‌లోని ఆదివాసులకు ఎంత రుణం మాఫీ చేశారు. కాంగ్రెస్ పార్టీ కనీస ఆదాయ పథకాన్ని తీసుకొస్తుంది. దేశంలోని పేదల బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బులు జమచేస్తాం. డసో సంస్థతో మోదీ సమాంతర చర్చలు జరిపారు. కాపలదారే దొంగ అనే నినాదం ఫ్రాన్స్‌లో ప్రాచుర్యం పొందింది. ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ సైతం కాపలదారే దొంగ అని చెప్పాడు."
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షులు
రఫేల్ ఒప్పందంపై కొనసాగిన విమర్శలు
రఫేల్ ఒప్పందంపై సుప్రీం, కాగ్ వంటి అత్యున్నత సంస్థలు మోదీకి క్లీన్‌చీట్ ఇచ్చినప్పటికీ రాహుల్ గాంధీ ఆరోపణలను కొనసాగిస్తూనే ఉన్నారు. మధ్యంతర బడ్జెట్లో కేంద్రం ప్రకటించిన ప్రోత్సాహకాలపైనా విమర్శలు గుప్పించారు రాహుల్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేదలకు కనీస ఆదాయం కింద రోజుకు రూ.17 రూపాయలు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇచ్చారు.