ఆస్ట్రేలియాలో భారతీయ డెంటిస్ట్ ప్రీతిరెడ్డి దారుణ హత్యకు గురైంది. మంగళవారం రాత్రి ఆమె కారులోనే సూట్‌కేసులో మృతదేహం లభ్యమైంది. తన మాజీ ప్రియుడు హర్ష్ నర్డే హత్య చేసినట్లు పోలీసులు నిర్ధరించారు. మృతురాలి శరీరంపై అనేక కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించారు. సిడ్నీలోని మార్కెట్ స్ట్రీట్‌లోని ఓ హోటల్లో తన మాజీ ప్రియుడు డాక్టర్ హర్ష్ నర్డేతో కలిసి వచ్చిన దృశ్యాలు సీసీ టీవీ దృశ్యాల్లో నిక్షిప్తమయ్యాయి. మృతదేహం లభ్యమైన మరుసటి రోజే డాక్టర్ హర్ష్ నర్డే కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందటంతో ఈకేసులో కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
సిడ్నీకి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్లెన్‌బ్రూక్ డెంటల్ హాస్పిటల్లో ప్రీతిరెడ్డి సర్జన్‌గా పనిచేస్తోంది. ఓ కాన్ఫరెన్స్‌కు హాజరయ్యేందుకు సెయింట్ లియోనార్డ్స్కు వచ్చింది. ఆదివారం బసచేసిన హోటల్ నుంచి అదృశ్యమైంది. ఆమె చివరిసారిగా మెక్ డోనాల్డ్‌కు వెళ్లినట్లు సీసీ కెమెరాలో నమోదైందని ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న సౌత్ వేల్స్ పోలీసులు తెలిపారు.