వర్షాకాలంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్ఎంసీ చర్యలు ప్రారంభించింది. గతంలో పూడిక పనుల నిర్వహణలో జాప్యం కారణంగా.. నాలాలు మట్టితో నిండిపోయేవి. ఇక నుంచి వర్షాకాలానికి ముందు నాలాల పూడిక పనులకు స్వస్తి పలికి.. సంవత్సరం పొడవునా ఈ పనులను చేపట్టాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. నగరంలోని 806 కిలోమీటర్ల విస్తీర్ణంలోని నాలాల పూడికతీత పనులు రూ. 38.24 కోట్ల వ్యయంతో చేపట్టారు.
నెలాఖరులోపు పూర్తి..
గ్రేటర్ హైదరాబాద్లో పూడిక పనులను జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ నిర్వహణ విభాగం చేపట్టింది. నాలాల్లో పూడిక వ్యర్థాలను తొలగించి మట్టిని సమీపంలోని డంపింగ్ యార్డుకు తరలించే బాధ్యత కాంట్రాక్టర్ చేపట్టాల్సి ఉంటుంది. ఈ నెలాఖరు లోపు వంద శాతం పూడికతీత పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మే తర్వాత కూడా వానల వల్ల తిరిగి పూడిక ఏర్పడితే ఎప్పటికప్పుడు తొలగించే పనులు నిరంతరం కొనసాగిస్తామని అధికారులు తెలిపారు.