రాష్ట్రంలో రసాయన ఎరువుల అనధికార అమ్మకాలు, అక్రమ నిల్వలు నిరోధించేందుకు సర్కారు చర్యలకు ఉపక్రమించింది. పారదర్శకతకు అద్దం పట్టేలా నేరుగా నగదు బదిలీ, డీబీటీ అమలుతో పాటు, క్షేత్రస్థాయిలో రైతులు, ఇతర వర్గాలను భాగస్వామ్యం చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి చిల్లర, టోకు వ్యాపారినే కాకుండా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు, రాష్ట్ర సహకార మార్కెటింగ్ సమాఖ్య - మార్క్‌ఫెడ్ సంస్థలపై కూడా నిఘా పెట్టాలని అధికారులను ఆదేశించింది. రాష్ట్రంలో ఏ రైతుకైనా సరే తప్పనిసరిగా పాయింట్ ఆఫ్ సేల్స్ - పాస్ యంత్రంపైనే ఎరువులు విక్రయించాలని ప్రభుత్వం సూచించింది. ఇది ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ నుంచి తప్పనిసరి చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వ రంగంలో కూడా కఠినంగా..
పీవోఎస్ యంత్రంపై అమ్మని వ్యాపారులు, డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక నుంచి రాష్ట్రంలో ప్రతి ఎరువు బస్తాపై విధిగా నియంత్రణ ఉంటుంది. ఎక్కడ నిల్వ చేశారు...? ఎక్కడికి తరలించారు...? ఎవరికి అమ్మారనేది ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ ద్వారా గుర్తించాలని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. సాధారణంగా ప్రైవేటు వ్యాపారుల నిల్వలు, అమ్మకాలపైనే గతంలో ఇలాంటి నిబంధనలు, నియంత్రణ పెట్టేవారు. ఈ సీజన్ నుంచి ప్రభుత్వ రంగ సంస్థ మార్క్‌ఫెడ్‌తోపాటు సహకార సొసైటీలకు కూడా కఠిన ఆంక్షలు విధించడం గమనార్హం. ఏ మాత్రం తేడాలు గుర్తించినా వెంటనే సంబంధిత ప్యాక్స్ ఎరువుల విక్రయ లైసెన్సులు రద్దు చేయడమే కాకుండా దానికి... ఎరువులు ఇచ్చిన మార్క్‌ఫెడ్ జిల్లా అధికారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించింది.
మార్గదర్శకాల్లోని ముఖ్యాంశాలు...
- ప్రతి చిల్లర, టోకు వ్యాపారితోపాటు ప్యాక్స్, మార్క్‌ఫెడ్‌పైనా నిఘా పెట్టాలి
- జిల్లా వ్యవసాయ అధికారి ప్రతి ఎరువుల దుకాణం తరచూ తనిఖీ చేయాలి
- వరసగా 3 నెలలు ఎరువులు అమ్మని చిల్లర వ్యాపారిపై విచారణ చేయాలి
- ప్రతి చిల్లర వ్యాపారి వద్ద చక్కగా పనిచేసే యంత్రం ఉండాలి. అది ఉన్నా వాడకపోతే వెంటనే తీసేసుకుని అవసరమైన వారికి ఇవ్వాలి
- నెలకోమారు ఎన్ని ఎరువులు అమ్మారనే నివేదిక చిల్లర వ్యాపారి ఇవ్వాలి
- ఎరువుల దుకాణాన్ని వ్యవసాయాధికారి తనిఖీ చేసినప్పుడు అక్కడ ఉన్న నిల్వకు పాస్ యంత్రంలో కనిపించే నిల్వల గణాంకాలు సరిపోల్చి చూడాలి. తేడాలు ఉంటే వెంటనే లైసెన్సు రద్దు చేయాలి
- టోకు వ్యాపారులు అధిక నిల్వలు పెట్టుకోకుండా ఎప్పటికప్పుడు చిల్లర వ్యాపారులకు పంపాలి. వారి వద్ద ఉండే నిల్వలన్నీ ఆన్‌లైన్‌లో కనిపించాలి
- రాష్ట్రానికి ఒక రైలులో వచ్చే యూరియాలో 50 శాతం తప్పనిసరిగా మార్క్‌ఫెడ్ కంపెనీలుకు ఇవ్వాలి. వీటిని అత్యవసర సమయంలో రైతులకు ప్యాక్స్‌ల ద్వారా అమ్మేందుకు మార్క్‌ఫెడ్ నిల్వ చేయాలి
- ప్యాక్స్‌లు సైతం రైతులకు పాస్ యంత్రాల ద్వారానే విక్రయించాలి. అవి లేని ప్యాక్స్‌పై చర్యలు తీసుకోవాలి
20 మంది వివరాలు కూడా..
ప్రతి జిల్లాలో అత్యధికంగా ఎరువు కొనే వారి జాబితాలు తయారు చేయాలి. అందులో అధిక భాగం ఎరువులు కొనుగోలు చేసే 20 మంది వివరాలు సేకరించాలి. ఆ ఎరువులను ఎక్కడ వినియోగిస్తున్నారో పరిశీలించాలి. ప్రతి ఎరువుల వ్యాపారి, మార్క్‌ఫెడ్, ప్యాక్స్ సిబ్బంది సాగించే విక్రయాలపై నిఘా పెట్టి ఎక్కడ లొసుగులున్నా వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని సర్కారు స్పష్టం చేసింది.
ఇవీ చూడండి: నైరుతి రుతుపవనాలు వచ్చేశాయ్...