అసంఘటిత రంగ కార్మికులంతా ఫిబ్రవరి 15 నుంచి ప్రధానమంత్రి శ్రమ్‌యోగి మాన్‌ధన్ పథకంలో చేరవచ్చని కార్మిక శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పథకం ద్వారా కార్మికులు 60 ఏళ్ల నుంచి నెలకు కనీసం రూ.3000 పింఛను పొందనున్నారు.
2019-20 బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ఈ పథకాన్ని ప్రకటించారు. 18-40 ఏళ్ల వయస్సు వారు దీనికి అర్హులు. కార్మికులు నెలకు 55 రూపాయలతో ఈ పథకంలో చేరవచ్చు. 40 ఏళ్ల వయస్సు కంటే ఎక్కువ ఉన్నవారు నెలకు రూ.200 జమ చేయాల్సి ఉంటుంది. అదే 29 ఏళ్ల వారికైతే ఈ మొత్తం రూ. 100 మాత్రమే.
కార్మికులు ఇచ్చిన మొత్తానికి సమాన డబ్బును ప్రభుత్వం జమచేస్తుంది. జాతీయ పింఛను పథకం, ఈఎస్ఐ, ఉద్యోగ భవిష్య నిధి పథకాల్లో ఉన్న వారితో పాటు ఆదాయపు పన్ను కట్టే అసంఘటిత కార్మికులు ఈ పథకానికి అనర్హులు.
లబ్ధిదారు ఏదైనా కారణంతో మరణించినట్లయితే జీవిత భాగస్వామి పథకాన్ని కొనసాగించవచ్చు. అలాకాకుండా అప్పటివరకు జమచేసిన మొత్తాన్ని వడ్డీతో సహా వెనక్కి తీసుకునే అవకాశమూ ఉంది.
లబ్ధిదారుడు శాశ్వత వైకల్యానికి గురైతే... భాగస్వామి ఈ పథకాన్ని కొనసాగించవచ్చు. ఒక వేళ పింఛనుదారు మరణించినట్లయితే జీవిత భాగస్వామి సగం పింఛను మాత్రమే తీసుకునే నిబంధన ఉంది.