కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ హవల్దార్‌గా పనిచేస్తున్న ఫ్రాన్సిస్.. బంగారాన్ని అక్రమ రవాణ చేస్తూ సీబీఐ అధికారులకు చిక్కాడు. అతడి నుంచి రూ.1.01 కోట్లు విలువ చేసే 3 కిలోల బంగారాన్ని సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులనూ అదుపులోకి తీసుకున్నారు.
ఫైసల్, అదినన్ ఖలీద్ ఇద్దరూ బంగారాన్ని అక్రమ రవాణా చేస్తుంటారు. వీరు కొచ్చి విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారిగా పనిచేస్తున్న ఫ్రాన్సిస్ సహాయంతో దుబాయి నుంచి తెచ్చిన బంగారాన్ని విమానాశ్రయం నుంచి తరలించాలని ప్రణాళిక వేసుకున్నారు.
మార్చి 1న ఫ్రాన్సిస్ తన గుర్తింపు (ఐడీ) కార్డును చూపించి విమానాశ్రయంలోకి ప్రవేశించాడు. ఫైసల్ ఆదేశం మేరకు అక్కడే ఉన్న ఖలీద్.... మరుగుదొడ్డిలో ఫ్రాన్సిస్‌కు ఆ బంగారాన్ని అందించాడు. ఫ్రాన్సిస్ ఆ బంగారు కడ్డీలను ఐదు చడ్డీల్లో ఉంచుకుని, విమానాశ్రయం నుంచి బయటకు వచ్చాడు.