మల్లన్నసాగర్ నిర్వాసితుల్లో మిగిలిన వారికి కూడా సహాయ, పునరావాస ప్యాకేజీని యుద్ధ ప్రాతిపదికన అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రెండు రోజుల్లో మిగిలిన వారందరికీ పరిహారం అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. మల్లన్నసాగర్ పునరావాసంతో పాటు కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల పనుల పురోగతిపై సీఎం ఏడు గంటల పాటు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముంపు ప్రాంతాల్లోని గ్రామాలవారీగా పునరావాస చర్యలపై వివరాలు అడిగి తెలుసున్నారు. పరిహారం, పునరావాసాలపై 15వ తేదీన కోర్టుకు నివేదిక సమర్పించాల్సి ఉండటం వల్ల సూక్ష్మస్థాయిలో సమీక్ష జరిపారు.
పరిహారం అందేలా చూడాలి
బాధిత కుటుంబాలన్నింటికీ పునరావాస ప్యాకేజీ అందేలా చూడాలని పరిహారం పంపిణీ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక అధికారులను ఆదేశించారు. కోర్టును ఆశ్రయించిన వారిలో భూములు ఇచ్చిన వారు ఎంత మంది, ఇవ్వాల్సిన వారు ఎంతమంది ఉన్నారనే అంశాలపైనా ఆయన సమీక్షించారు.