రాష్ట్ర ప్రభుత్వం నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో నిర్వహిస్తున్న తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మొదటగా గన్‌పార్కు వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన కేసీఆర్... తదుపరి పబ్లిక్ గార్డెన్స్‌కు చేరుకున్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి... పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలందరికీ సీఎం కేసీఆర్ తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నాలుగేళ్లలో తెలంగాణ సాధించిన ప్రగతిని... సంక్షేమ పథకాల అమలును వివరించారు.
అపహాస్యం చేసిన వాళ్లు అవాక్కయ్యేలా...
తెలంగాణ వాళ్లకు పరిపాలన చేతకాదని, తెలంగాణ వస్తే గాడాంధకారం అలుముకుంటుందని తెలంగాణ రాష్ట్రంగా మనుగడ సాగించలేదని సమైక్య పాలకులు జోకులు వేశారు. కానీ నవ్విన నాపచేనే పండిందన్నట్లుగా... తెలంగాణ ప్రగతిపథంలో పరుగులు తీస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రజలు, ప్రభుత్వం ఏకతాటిపై నిలిచి, పట్టుదలతో ప్రయత్నించి సాధించిన సమిష్టి విజయమని స్పష్టం చేశారు.
రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ
రాష్ట్రంలో రైతులకు మరో లక్ష రూపాయల రుణమాఫీ చేయబోతున్నామని కేసీఆర్ ప్రకటించారు. రైతుబంధు పథకం ప్రపంచం దృష్టిని ఆకర్షించిందని తెలిపారు. కేంద్రం ప్రవేశపెట్టిన పథకానికి రైతు బంధు పథకమే ప్రేరణ అని ఆయన వివరించారు. ప్రపంచంలోనే గొప్ప పథకంగా రైతు బంధు పథకాన్ని ఐరాస ప్రశంసించిందని సీఎం గుర్తు చేశారు. రైతుబీమా పథకం కింది పెట్టుబడికి అందించే డబ్బును ఎకరాకు 8 వేల నుంచి 10 వేలకు పెంచినట్లు తెలిపారు. ఈ ఏడు నుంచి అది అమల్లోకి తీసుకువస్తున్నట్లు వివరించారు. రైతులందరూ ఒకే పంట వేయడం వల్ల, డిమాండ్ తగ్గి గిట్టుబాటు ధర రాకుండా పోయే ప్రమాదాన్ని నివారించేందుకు క్రాప్ కాలనీలను ఏర్పాటు చేయబోతున్నామన్నారు.
గ్రామ పంచాయతీలకు కనీసం రూ.8లక్షల నిధులు
దళారుల ప్రమేయం లేకుండా ఆసరా పింఛన్లు అందిస్తున్నామని సీఎం తెలిపారు. రాష్ట్రం ఏర్పడినపుడు రెండు వందలుగా ఉన్న పింఛన్ని 3 వేలకు పెంచామన్నారు. వీటిని జులై 1వ తేదీ నుంచి లబ్ధిదారులకు అందించబోతున్నామని స్పష్టం చేశారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు తన మానసపుత్రికలుగా సీఎం అభివర్ణించారు. 500 జనాభా కలిగిన చిన్న గ్రామ పంచాయతీకి కూడా ఏడాదికి 8 లక్షల రూపాయల అభివృద్ధి నిధులు అందిస్తామని చెప్పారు. దీని ద్వారా భవిష్యత్తులో గ్రామ పంచాయతీలకు నిధుల కొరత అనే సమస్య లేకుండా చేస్తామన్నారు. త్వరలో దంత, చెవి, ముక్కు, గొంతు వ్యాధుల నివారణ కోసం ప్రత్యేక కార్యక్రమాలను ప్రభుత్వం ప్రారంభిస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు.