పంటలకు కనీస మద్దతు ధర కల్పించేలా అవసరమైన వ్యూహం ఖరారు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రైతులకు కనీస మద్దతు ధర కల్పించేందుకు అనుసరించాల్సిన వ్యూహం రూపొందించేందుకు ప్రగతి భవన్లో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
సాగును లాభసాటిగా చేయాలి
వ్యవసాయ, ఉద్యానవన, మార్కెటింగ్, పౌరసరఫరాలు తదితర శాఖలన్నీ సమన్వయంతో వ్యవహరించి... రైతులకు కనీస మద్దతు ధర కల్పించి, వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడమే లక్ష్యంగా పనిచేయాలని సీఎం సూచించారు. ఇందుకోసం రానున్న పది రోజుల్లో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి సమగ్ర సమాచారం సేకరించాలని ఆదేశించారు. రాష్ట్రంలో పంటకాలనీలు ఏర్పాటు చేయాలని చెప్పారు.
ఐదు నిమిషాల్లోనే చెక్కు ఇచ్చే పద్ధతి రావాలి
రైతులు పండించిన ప్రతి గింజకు మంచి ధర వచ్చేలా ప్రభుత్వ విధానం ఉండాలని... అన్నదాతల నుంచి నేరుగా మార్కెటింగ్ శాఖ కొనుగోళ్లు జరపాలని కేసీఆర్ పేర్కొన్నారు. రైతులు పండించిన పంట మార్కెట్లో కాంటా అయిన ఐదు నిమిషాల్లోనే చెక్కు ఇచ్చే పద్ధతి రావాలని ఆకాంక్షించారు. ఇతర రాష్ట్రాలు, దేశాలకు ఎగుమతి చేసే పరిస్థితి రావాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు ఎవరూ సరుకులు కొనకుండా చూడాలని ఆదేశించారు.