తెలంగాణ

telangana

ETV Bharat / briefs

హాంగ్​కాంగ్​లో ఆగ్రహ జ్వాలలు..​ పార్లమెంటు ధ్వంసం

హాంగ్​కాంగ్​లో ఆందోళనకారులు ఏకంగా పార్లమెంటు భవనాన్నే ధ్వంసం చేశారు. ప్రభుత్వం స్వేచ్ఛను హరించవేయాలని చూస్తోందని రోడ్లపై సోమవారం భారీ ఎత్తున నిరసనలు చేపట్టారు. పలు ప్రాంతాల్లో ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ చెలరేగింది.

హాంగ్​కాంగ్​లో ఆగ్రహ జ్వాలలు..​ పార్లమెంటు ధ్వంసం

By

Published : Jul 2, 2019, 7:02 AM IST

ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలతో హాంగ్​కాంగ్ రోడ్లు రణరంగాన్ని తలపించాయి. స్వేచ్ఛను హరించేలా ప్రభుత్వం అడుగులేస్తోందని ఆరోపిస్తూ ఆందోళనకారులు సోమవారం పార్లమెంటు భవనాన్ని ధ్వంసం చేశారు. ప్రవేశ ద్వారం అద్దాలు పగులగొట్టి, షట్టర్లను విరగ్గొట్టి భవనంలోకి చొచ్చుకెళ్లారు. ప్రభుత్వ అధికార చిహ్నాన్ని ధ్వంసం చేశారు.

హాంగ్​కాంగ్​లో ఆగ్రహ జ్వాలలు..​ పార్లమెంటు ధ్వంసం

బ్రిటీష్‌ పాలనలో ఉండే జెండాను ఎగురవేసి... ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

పార్లమెంటులోకి ప్రవేశించకుండా ఆందోళనకారులను నిలువరించేందుకు పోలీసులు పెప్పర్ స్ప్రే ప్రయోగించారు. అయినా వారు వెనక్కితగ్గలేదు.

సోమవారం నిరసనలకు కొనసాగింపుగా మంగళవారం ఉదయం కూడా ఆందోళనలు చేపట్టేందుకు రోడ్లెక్కారు ప్రజలు. నిలువరించేందుకు ప్రయత్నించిన పోలీసులతో ఘర్షణకు దిగారు.

పోలీసుల అధీనంలో పార్లమెంటు..

ఆందోళనకారులను చెదరగొట్టేందుకు మంగళవారం ఉదయం భాష్పవాయువు ప్రయోగించారు పోలీసులు. పార్లమెంటును పూర్తిగా అధీనంలోకి తీసుకున్నారు.
హింసాత్మక నిరసనలను హాంగ్​కాంగ్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించినట్లు చైనా అధికారిక మీడియా తెలిపింది.

బ్రిటిష్​ నుంచి చైనా పాలనకు..

బ్రిటిష్​ సామ్రాజ్యంలో భాగంగా ఉన్న హాంగ్​కాంగ్ 1997 జులై 1న చైనా పరిపాలనలోకి వచ్చింది. 'ఒకే దేశం, రెండు వ్యవస్థలు' ద్వారా ఇప్పటికీ ప్రత్యేక పాలన సాగిస్తోంది.

చైనా పరిపాలనలోకి వచ్చి 22 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 'వాన్ చై'లోని కన్వెన్షన్ సెంటర్ లో ప్రభుత్వం సోమవారం సంబరాలు నిర్వహించింది. ఈ ఉత్సవాలను వ్యతిరేకిస్తూ వేలాది మంది రోడ్డెక్కారు.

నేరపూరిత కేసుల విచారణ నిమిత్తం తమ దేశ పౌరులను చైనాకు అప్పగించాలన్న బిల్లుకు వ్యతిరేకంగా హాంగ్​కాంగ్​ ప్రజలు ఇటీవలే పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. వారం రోజుల పాటు జరిగిన ఆందోళనల అనంతరం ఆ బిల్లును పక్కనబెడుతున్నట్లు హాంగ్​కాంగ్ ప్రభుత్వాధికారులు ప్రకటించారు.

ఇదీ చూడండి: లెబనాన్​: మంత్రి వాహనశ్రేణిపై తుపాకీ గుళ్ల వర్షం

ABOUT THE AUTHOR

...view details