తెలుగుదేశం పార్టీ ఏపీ శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రజల కోపం వల్ల తాము ఓటమి పొందలేదని, జగన్ పట్ల ఉన్న సానుభూతే ఆ పార్టీని గెలిపించిందనే అభిప్రాయం శాసనసభాపక్ష సమావేశంలో వ్యక్తమైంది. తెలుగుదేశం ఎప్పుడూ ప్రజల మధ్యే ఉంటుందన్న చంద్రబాబు... నేతలెవ్వరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు చిత్తశుద్ధితో పనిచేశామని... కాలంతో పరుగెత్తి అనేక పనులు చేశామని చంద్రబాబు గుర్తుచేశారు.
టీడీఎల్పీ నేతగా చంద్రబాబు ఏకగ్రీవం - babu
తెలుగుదేశం పార్టీ ఏపీ శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు ఎన్నికయ్యారు. అమరావతిలోని చంద్రబాబు నివాసంలో జరిగిన టీడీఎల్పీ సమవేశంలో ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశానికి సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావు, సుజనా చౌదరి, కనకమేడల రవీంద్రబాబు, సీఎం రమేశ్, గరికపాటి మోహన్‌రావు తదితరులు హాజరయ్యారు.
అభివృద్ధి, సంక్షేమంతో పాటు మౌలిక వసతులకు పెద్దపీట వేశామన్నారు. రాజధాని నిర్మాణ పనులు వేగంగా చేపట్టామని... ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకున్నా అనేక పనులు చేశామన్నారు. కొత్త ప్రభుత్వం ఏం చేస్తుందో... కొంతకాలం వేచిచూద్దామని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారానికి శాసనసభ గొప్ప వేదిక అన్న చంద్రబాబు... సభకు హాజరు కాకుండా గత ప్రతిపక్షం వ్యవహరించినట్లు చేయవద్దని చెప్పారు. నాయకులంతా ప్రజలతో మమేకం కావాలని... ఎక్కడా పార్టీపైన, తెదేపా ప్రభుత్వంపైన వ్యతిరేకత లేదని స్పష్టం చేశారు. అన్నివర్గాల మద్దతు సాధించడమే లక్ష్యంగా పనిచేద్దామని నేతలకు చంద్రబాబు సూచించారు.
ఇదీ చదవండీ: 'సున్నా వేయడం వాళ్ల హక్కు... అంతే వేస్తాం'