మేనిఫెస్టోను నేడు విడుదల చేయనున్న భారతీయ జనతా పార్టీ లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోను భారతీయ జనతా పార్టీ నేడు విడుదల చేయనుంది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్ షా సహా ముఖ్యనేతలు హాజరవనున్నారు. పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యులందరూ పాల్గొననున్నారు.
సంకల్ప్పత్ర్ పేరుతో మేనిఫెస్టోను రూపొందించింది భాజపా. అభివృద్ధి, జాతీయ భద్రతే ప్రధానాంశాలుగా ఉండొచ్చు.
సమాజంలోని అన్ని వర్గాలను సంతృప్తి పరిచే విధంగా.. ముఖ్యంగా రైతులు, యువత, మహిళలపై మేనిఫెస్టోలో హామీల వర్షం కురిపించే అవకాశం ఉంది.
భాజపా ఎన్నికల ప్రచార నినాదాన్ని ఆదివారమే ప్రకటించారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. ఫిర్ ఏక్ బార్, మోదీ సర్కార్(మరోసారి మోదీ ప్రభుత్వం) నినాదంతో ప్రజల్లోకి వెళ్లనున్నట్టు వెల్లడించారు.
ఇటీవలే విడుదల చేసిన మేనిఫెస్టోలో అనేక సంక్షేమ పథకాలను ప్రకటించింది ప్రతిపక్ష కాంగ్రెస్. దేశంలో నిరుపేదలైన 20శాతం కుటుంబాలకు కనీస ఆదాయ పథకం కింద ఏడాదికి రూ.72వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో భాజపా మేనిఫెస్టోలో ఎలాంటి పథకాలు, హామీలు ఉంటాయోనని దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
ఇదీ చూడండి : భాజపా నినాదం: 'మరోసారి మోదీ సర్కార్'