సార్వత్రిక ఎన్నికల్లో 437 లోక్‌సభ స్థానాల్లో భాజపా పోటీ భారతీయ జనతా పార్టీ ఈ సార్వత్రిక ఎన్నికల్లో సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఆ పార్టీ ఈ ఎన్నికల్లో 437 లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థులను పోటీకి నిలబెట్టింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మాత్రం 2014 కంటే తక్కువ స్థానాల్లో పోటీకి దిగుతోంది.
2014లో 427 లోక్‌సభ స్థానాల్లో బరిలోకి దిగింది భాజపా. వాటిలో 282 స్థానాల్లో గెలుపొందింది. ఆ ఎన్నికల్లో 450 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ కేవలం 44 సీట్లను సాధించగలిగింది.
2014 తర్వాత దేశంలోని చాలా ప్రాంతాలకు పార్టీని విస్తరించామని భాజపా భావిస్తోందని, అందుకే కాంగ్రెస్ కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గత ఎన్నికల్లో మిత్రపక్షాలతో పొత్తు పెట్టుకుంది భాజపా. అయితే ఈ సారి ఆ రాష్ట్రాల్లో ఎలాంటి పొత్తులు లేవు. అన్ని స్థానాల్లోకి ఒంటరిగానే బరిలోకి దిగుతోంది.
2014 కంటే ఈ ఎన్నికలకు ఎక్కువ పార్టీలతో పొత్తు పెట్టుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ తక్కువ స్థానాల్లో పోటీకి దిగనుంది. గత ఎన్నికల్లో కర్ణాటకలో అన్ని స్థానాల్లో పోటీ చేసింది హస్తం పార్టీ. ఈసారి జేడీఎస్‌తో పొత్తు పెట్టుకుంది. బిహార్‌లోనూ కొత్త మిత్రులతో కూటమి కట్టింది కాంగ్రెస్.