తెలంగాణ

telangana

ETV Bharat / briefs

చౌకీదార్​ వైపా? కుటుంబపార్టీల వైపా?

తెరాస వైఫల్యాలను ఎండగడుతూ... కుంభకోణాల పార్టీ కాంగ్రెస్ అంటూ మహబూబ్​నగర్​ భాజపా సభలో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ప్రధాని మోదీ. ప్రజలు చౌకీదార్​ వైపు ఉంటారా? కుటుంబ పార్టీల వైపు ఉంటారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్, తెరాస, ఎంఐఎం పార్టీలపై సూటిగా విమర్శలు గుప్పిస్తూ.. ప్రధాని ప్రసంగం కొనసాగింది.

ప్రధాని మోదీ

By

Published : Mar 29, 2019, 7:59 PM IST

Updated : Mar 29, 2019, 9:54 PM IST

పాలమూరులో ఎన్నికల శంఖారావం పూరించిన మోదీ
దక్షిణ భారతదేశంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి ప్రధాని నరేంద్ర మోదీ శంఖారావం పూరించారు. శాసనసభ ఎన్నికల్లో పాటించిన సెంటిమెంట్​ను కొనసాగిస్తూ... పాలమూరు జిల్లాలో ఏర్పాటు చేసిన తొలి ప్రచార సభకు ఆయన హాజరయ్యారు.

పాలమూరుకు వందనం

పాలమూరు ప్రజలకు నమస్సుమాంజలి అంటూ.. తెలుగులో ప్రసంగం మొదలుపెట్టి ప్రజలను ఉత్సాహపరిచారు ప్రధాని. సురవరం ప్రతాప్‌రెడ్డి, గడియారం రామకృష్ణ శర్మ, కపిలవాయి లింగమూర్తి నడయాడిన నేల ఇదంటూ కొనియాడారు. మీ చౌకీదార్.. మీ ఆశీర్వాదం కోసం ఇక్కడికి వచ్చాడు అని వ్యాఖ్యానించారు.

60నెలల చౌకీదార్ పాలన చూశారు

60 ఏళ్ల కాంగ్రెస్, 60 నెలల చౌకీదార్ పాలన చూశారన్నారు. తెలంగాణ ప్రజల కలలను సాకారం చేస్తానని మోదీ హామీ ఇచ్చారు. ఐదేళ్ల భాజపా పాలనలో దేశ అభివృద్ధికి ఎంతో కృషి చేశామని వెల్లడించారు. నవభారత నిర్మాణం కోసం మరోసారి భాజపాకు ఓటు వేయాలని కోరారు. ప్రధాని కోసం కాదు దేశం కోసం ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఉపగ్రహ విధ్వంసక క్షిపణి ప్రయోగం విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. దేశ అభివృద్ధి, సంక్షేమం కోసం పాటుపడుతుంటే తనపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఉగ్రవాద, తీవ్రవాద కార్యకలాపాలు అరికట్టామని ధీమా వ్యక్తం చేశారు.

ముందస్తుకు ఎందుకు వెళ్లారు?

తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లారో వాళ్లకే తెలియదని నరేంద్రుడు ఎద్దేవా చేశారు. మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడంలో 3 నెలలు ఎందుకు పట్టిందని ప్రశ్నించారు. ఏ జ్యోతిష్యుడి సలహా ప్రకారం మంత్రివర్గ ఏర్పాటును జాప్యం చేశారని అడిగారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లడం వల్ల ప్రజాధనం దుర్వినియోగం అయిందని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల భవిష్యత్తు మీరు నిర్ణయించాలా... జ్యోతిష్యుడు నిర్ణయించాలో ఆలోచించండని సూచించారు.

కాంగ్రెస్​పై నిప్పులు...

కాంగ్రెస్‌ స్వప్రయోజనాలు, కుటుంబ ప్రయోజనాల కోసమే పనిచేస్తోందని ప్రధాని దుయ్యబట్టారు. నీతిమాలిన రాజకీయాలు చేస్తోందన్నారు. కుంభకోణాల కాంగ్రెస్‌ను ప్రజలు తిరస్కరిస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వీర జవాన్ల పోరాటాలపై కూడా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
మహబూబ్‌నగర్‌ ప్రజల ఓట్లతో కేసీఆర్‌ కుటుంబమే బాగుపడిందన్నారు. మత రాజకీయాలు జరిపే ఎంఐఎంతో తెరాస చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతోందని ధ్వజమెత్తారు.

నేనూ చౌకీదార్​నే...

ఒకవైపు స్వచ్ఛమైన చౌకీదార్‌.. మరోవైపు అవినీతి కుటుంబదారులు ఉన్నారు ఎవరికి ఓటు వేయాలో మీరే తేల్చుకోండని మోదీ స్పష్టం చేశారు. ఏప్రిల్‌ 11న చౌకీదార్‌ను ఆశీర్వదించండి... భాజపాకు పట్టం కట్టండని కోరారు. నేను కూడా చౌకీదార్‌నే అంటూ ప్రజలతో నినాదాలు చేయించి ప్రధాని ప్రసంగం ముగించారు.

ప్రధాని సమక్షంలో చేరికలు

కాంగ్రెస్ దేవరకద్ర నియోజకవర్గ మాజీ ఇన్​ఛార్జి డోకూరి పవన్ కుమార్ రెడ్డి, మాజీమంత్రి పి.చంద్ర శేఖర్, మక్తల్​ తెరాస తిరుగుబాటు నేత జలందర్ రెడ్డి, మోదీ సమక్షంలో భాజపాలో చేరారు. ఈసభలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, మహబూబ్​నగర్ పార్లమెంట్​ అభ్యర్థి డీకే అరుణ, ఎంపీ జితేందర్ రెడ్డి, నాగర్​కర్నూల్ లోక్​సభ అభ్యర్థి బంగారు శ్రుతి ఇతర నాయకులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:తెలంగాణ భవిష్యత్తు ఓ జ్యోతిష్యుడు నిర్ణయిస్తాడా? మోదీ

Last Updated : Mar 29, 2019, 9:54 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details