తెలంగాణ

telangana

ETV Bharat / briefs

పొత్తుల ఎత్తుల్లో 'కమల విజయం' - రాష్ట్రం

కాంగ్రెస్​తో పోలిస్తే పొత్తుల రాజకీయంలో భాజపా ముందంజలో ఉంది. మిత్రపక్షాలుగా ఉన్న ప్రాంతీయ పార్టీలతో లోక్​సభ స్థానాల సర్దుబాటులో స్పష్టతనిచ్చింది. పొత్తులో భాగంగా కొన్ని రాష్ట్రాల్లో మిత్రులకు ఎక్కువ స్థానాలిచ్చేందుకు వెనుకాడట్లేదు. అసంతృప్తితో ఉన్న పక్షాలనూ బుజ్జగిస్తోంది. ఈసారి ఎన్నికల్లో పూర్తి మెజార్టీ కష్టమనే అంచనాలతో ఎన్డీఏలోని పక్షాలకు భాజపా  ప్రాధాన్యమిస్తోందని విశ్లేషణలు వస్తున్నాయి.

ఎన్నికల ముందు రాజకీయ పొత్తుల్లో దూసుకెళ్తున్న భాజపా

By

Published : Mar 12, 2019, 5:49 PM IST

ఎన్నికల ముందు రాజకీయ పొత్తుల్లో దూసుకెళ్తున్న భాజపా
సార్వత్రిక ఎన్నికల భేరి మోగింది. మొత్తం ఏడు దశల్లో లోక్​సభ పోలింగ్ జరగనుంది. మొదటి విడతకు నెలరోజుల గడువు కూడా లేదు. పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపిక, సీట్ల సర్దుబాటులో తలమునకలయ్యాయి. అయితే పొత్తుల రాజకీయంలో మాత్రం భారతీయ జనతా పార్టీ ముందుంది. మహాకూటమి పేరిట కాంగ్రెస్​ చేస్తున్న ప్రయత్నాలు ఇంకా ప్రయత్నాలుగానే సాగుతున్నాయి. ఎప్పుడు కొలిక్కివస్తుందనే స్పష్టత లేదు.

భాజపా మాత్రం ఆయా రాష్ట్రాల్లో మిత్రపక్షాలను దగ్గర చేసుకుంటూ పోతోంది. అసంతృప్త పార్టీలను బుజ్జిగిస్తోంది. కాస్త బలమున్న మిత్రపక్షాలకు ఎక్కువ స్థానాలు కేటాయించేందుకూ అంగీకరిస్తోంది. ఈ సారి అధికారం చేపట్టేందుకు పొత్తులే కీలకం కానున్నాయని భావిస్తోంది కాషాయ పార్టీ.

ఏకఛత్రాధిపత్యం కష్టమని తెలిసే!

భాజపాకు ప్రస్తుత పరిస్థితి బాగా తెలుసు. గత ఎన్నికల్లో మాదిరి పూర్తి మెజార్టీ వస్తుందని భావించట్లేదు. ఈసారి తమ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలోకి రావాలంటే మిత్రపక్షాల మద్దతు కీలకమని అంచనా వేస్తోంది కమలదళం. అందుకే ఉత్తరాది, దక్షిణాది... పెద్దా, చిన్నా పార్టీలనే తేడా లేకుండా అన్ని రాష్ట్రాల్లో పొత్తులకు కసరత్తులు ముమ్మరం చేసింది. ఆయా రాష్ట్రాల్లో పోటీ చేసే లోక్​సభ స్థానాల విషయంలోనూ ఓ స్పష్టతకు వచ్చింది. పార్టీల మధ్య సీట్ల పంపకాలను దాదాపు పూర్తి చేసింది.

ఇవీ చూడండి:

ఓటరన్నా... ఇవి మీకోసమే....

దంగల్​ 2019: కేంద్రమంత్రులకు టికెట్​ కట్​!

రాజీకి సై

మిత్రపక్షాల ప్రాముఖ్యాన్ని గుర్తించిన భాజపా.. వాటికి ఎక్కువ స్థానాలు కేటాయించేందుకు వెనుకాడడం లేదు. బిహార్​, మహారాష్ట్ర సహా మరికొన్ని రాష్ట్రాల్లో భాజపా సీట్ల సర్దుబాటును గమనిస్తే ఇది స్పష్టంగా అర్థమవుతుంది.

బిహార్​లో భాజపా పట్టువిడుపు

బిహార్​లో మొత్తం 40 లోక్​సభ స్థానాలు. ఇక్కడ భాజపా, సీఎం నితీశ్​ కుమార్​ నేతృత్వంలోని జేడీయూ, రామ్​విలాస్​ పాసవాన్​​ అధినాయకత్వంలోని ఎల్​జేపీ కూటమిగా ఎన్నికల బరిలోకి దిగనున్నాయి. సీట్ల సర్దుబాటులో భాగంగా భాజపా, జేడీయూ చెరో 17స్థానాల్లో పోటీ చేయనున్నాయి. ఆరు స్థానాల్లో ఎల్​జేపీ బరిలోకి దిగనుంది.

బిహార్​లోని 40 లోక్​సభ స్థానాల్లో 2014 ఎన్నికల్లో భాజపా 22 గెలిచింది. అప్పుడు భాజపా, జేడీయూ ప్రత్యర్థులు. ఈ సారి మిత్రులు. గత ఎన్నికల్లో గెలిచిన కొన్ని స్థానాలను ఈసారి జేడీయూకి కేటాయించింది కమలం పార్టీ.

మహారాష్ట్రలోనూ భాజపాదే ముందడుగు..

మహారాష్ట్రలో పొత్తులు, పోటీ చేసే స్థానాల విషయంలో పూర్తి స్పష్టతనిచ్చింది కమలదళం. మిత్రపక్షమైన శివసేనతో దోస్తీని ఖరారు చేసుకుంది. మొత్తం 48 లోక్​సభ స్థానాలకు గాను భాజపా 25, శివసేన 23 స్థానాల్లో పోటీ చేయనుంది. ఒంటరిగా పోటీ చేస్తామని శివసేన గతంలో చాలాసార్లు ప్రకటించింది. అయితే శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్​ ఠాక్రేతో భాజపా అధ్యక్షుడు అమిత్​షా చర్చలు జరిపారు. ఎక్కువ స్థానాలు కేటాయించడం వల్ల పొత్తుకు సులువుగానే అంగీకరించారు ఠాక్రే.

కొలిక్కిరాని కాంగ్రెస్​ చర్చలు

ఒకవైపు పొత్తుల్లో భాజపా దూసుకెళుతుంటే.. మరోవైపు కాంగ్రెస్​ పార్టీ ఇంకా చర్చల దశలోనే ఉంది. బిహార్​లో లాలు ప్రసాద్​ యాదవ్​ నేతృత్వంలోని ఆర్​జేడీ, ఉపేంద్ర కుశ్వాహా అధినాయకత్వంలోని ఆర్​ఎల్​ఎస్​పీతో పాటు హెచ్​ఏఎం పార్టీలతోనూ హస్తం పార్టీ చర్చలు కొనసాగుతున్నాయి. ఆయా పార్టీలు అధిక స్థానాలను డిమాండ్​ చేస్తుండడం వల్ల ఆ పార్టీ సమాలోచనలో పడింది.

  • మహారాష్ట్రలోని మిత్రపక్షమైన ఎన్​సీపీతో కాంగ్రెస్​ సీట్ల పంపకం ఇంకా కొలిక్కిరాలేదు.
  • కర్ణాటకలోనూ దాదాపు అదే పరిస్థితి. సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి అయిన జేడీఎస్​తోనూ పొత్తుల స్థానాలపై స్పష్టత రాలేదు.

ఉత్తరప్రదేశ్​లో...

ఉత్తరప్రదేశ్​లోని రెండు ప్రముఖ పార్టీలు సమాజ్​వాదీ-బహుజన్​ సమాజ్​లు కూటమిగా ఏర్పడ్డాయి. లోక్​సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్నాయి. కాంగ్రెస్​ను పక్కనపెట్టాయి. ఇది భాజపాకు కాస్త కలిసొచ్చే అంశమే. కొంత శాతం ఓట్లు చీలి తమకే లాభిస్తుందని ఆశిస్తున్నారు కమలం పార్టీ నేతలు.

ఉత్తరప్రదేశ్​లో భాజపా మిత్రపక్షాలు... అప్నాదళ్​, సుహేల్​దేవ్​ భారతీయ సమాజ్​ పార్టీలు. భాజపా వైఖరి పట్ల గతంలో ఈ రెండు పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. అయితే కమలం పార్టీ నేతలు మాత్రం అవి తమతోనే ఉంటాయని విశ్వాసంగా చెబుతున్నారు.

దక్షిణాదిలో...

తమకు అంతగా బలం లేని దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడులో అన్నాడీఎంకేతో జతకట్టింది భాజపా. అలాగే చిన్నచిన్న పార్టీలను కలుపుకుపోతోంది.
ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రం పొత్తుల విషయంలో భాజపా విఫలమైంది. ఏ పార్టీ కమలంతో ఎన్నికలకు ముందు చేతులు కలిపేందుకు సిద్ధంగా లేదు. ఇందుకు ఆ రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులే కారణం. అయితే ఎన్నికల తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చి... భాజపావైపు ప్రముఖ పార్టీలు చూసే అవకాశాలు మెండుగా ఉన్నాయనేది రాజకీయ విశ్లేషకుల అంచనా.

భాజపా విమర్శలు

నాయకత్వంపై స్పష్టత లేని కారణంగా కాంగ్రెస్​ పార్టీ పొత్తులు కుదుర్చుకోలేక పోతోందని భాజపా అధికార ప్రతినిధి నలిన్​ కోహ్లీ అన్నారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని తమ పార్టీ అన్ని విషయాల్లో స్పష్టతతో ఉందని, తమ అజెండా.. అభివృద్ధేనని చెప్పారు.

543 లోక్​సభ స్థానాలకు ఏడు దశల్లో పోలింగ్​ జరగనుంది. ఏప్రిల్​ 11న మొదలై మే 19న జరిగే తుదిదశ పోలింగ్​తో లోక్​సభ పోరు ముగియనుంది. మే 23న ఫలితాలు వెల్లడికానున్నాయి.

ఇదీ చూడండి:దంగల్​ 2019: ఏ గట్టున ఏముంది?

ABOUT THE AUTHOR

...view details