భర్త వేధింపులు.. పిల్లలతో తల్లి ఆత్మహత్యాయత్నం హైదరాబాద్లోని రాచకొండ సీపీ కార్యాలయం ఎదుట ఓ మహిళ తనతో పాటు తన ముగ్గురు కుమారులపై కిరోసిన్ పోసి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. అక్కడున్న పోలీసు సిబ్బంది వెంటనే స్పందించి.. మహిళను, ఆమె కుమారులను కాపాడారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న తన భర్త సీఐ రాజయ్య నాలుగు వివాహాలు చేసుకుని మోసం చేశాడని బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా తనపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇంతకుముందు కూడా..
ఇంతకుముందు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో నమోదైన వేధింపుల కేసులో ఫిర్యాదురాలే... తన భర్త రాజయ్యతో అవగాహనకు వచ్చి కేసు ఉపసంహరించుకున్నారని ఏసీపీ పృథ్వీరాజ్ తెలిపారు. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో నమోదైన మరో కేసుపై న్యాయస్థానంలో అభియోగపత్రం కూడా దాఖలు చేశామన్నారు. బాధితురాలు ఫిర్యాదు చేసిన కేసుల్లో వెంటనే స్పందించి శాఖాపరంగా అన్ని చర్యలు తీసుకున్నామని.. ఆమెపై నమోదైన ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు గురించి తమకు తెలియదని పృథ్వీరాజ్ పేర్కొన్నారు.
బాధిత మహిళ తన గోడు చెప్పుకుంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. సొమ్మసిల్లిన మహిళకు అక్కడున్న సిబ్బంది ప్రథమ చికిత్స అందించారు.
ఇవి చూడండి:బొలెరో వాహనం ఢీకొని ఇద్దరు మృతి