తెలంగాణ

telangana

ETV Bharat / briefs

'దళపతి  వ్యూహం ఫలించింది ... గండం తప్పింది' - 2019 elections

జమిలి ఎన్నికలు ఉంటే అసెంబ్లీ అభ్యర్థులపై ప్రభావం పడుతుందని భావించిన గులాబీ దళపతి ముందస్తుకు వెళ్లి... విజయం సాధించారు. అవే ఫలితాలు లోక్​సభ ఎన్నికల్లో పునరావృతం అవుతాయని భావించినప్పటికీ మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ముందస్తుకు వెళ్లిన కేసీఆర్ వ్యూహం ఫలించింది.

kcr

By

Published : May 24, 2019, 7:59 PM IST

ఫలించిన కేసీఆర్ వ్యూహం

ముందస్తు ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన తెరాస... లోక్​సభ ఎన్నికల్లో అనుకున్న ఫలితాల్ని రాబట్టుకోలేక పోయింది. 16 స్థానాల్లో గెలిచి దిల్లీని శాసిద్దాం అనే నినాదాన్ని ప్రజలు విశ్వసించలేదు. అనుకున్న ఫలితాలు రాక పోవడం వల్ల గులాబీ దళం అంతర్మథనంలో పడింది. సార్వత్రిక ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరిగితే నష్టపోతామని గ్రహించిన గులాబీ దళపతి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారా అనే ప్రశ్న సర్వత్రా వ్యక్తమవుతోంది.

ఇందుకే ముందస్తుకు వెళ్లారా!

సార్వత్రిక ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరిగితే మోదీ, రాహుల్‌ ప్రభావం పడుతుందని కేసీఆర్ గ్రహించి ముందస్తుకు వెళ్లి ఉంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. లోక్​సభతో పాటు అసెంబ్లీ అభ్యర్థులపై ప్రభావం పడి తాజా ఫలితాల వలే శాసనసభలోనూ మిశ్రమ ఫలితాలు వస్తాయని అంచనా వేసి... గులాబీ దళపతి ముందస్తుకు జై కొట్టినట్లు తెలుస్తోంది.

వ్యూహం ఫలించింది

అభివృద్ధి, సంక్షేమ ఫలాలు వంటి అంశాలతో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించవచ్చని భావించిన కేసీఆర్... అసెంబ్లీని రద్దు చేశారు. అదే రోజు 105 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఎన్నికలకు తక్కువ సమయం ఉండటం వల్ల విజయం ఏకపక్షం అవుతుందని అంచనా వేశారు. తెలుగు రాష్ట్రాల్లో ముందస్తుకు వెళ్లి గెలుపొందిన సంఘటనలు తక్కువని పలువురు సూచించినా... సీఎం వెనుకడుగు వేయలేదు. అనుకున్నట్లుగానే ముందస్తుకు వెళ్లి భారీ మెజార్టీతో విజయం సాధించి విజయ దుందుభి మోగించారు.

లోక్​సభ ఎన్నికల ఫలితాలను ముందుగానే అంచనా వేసిన కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లి మంచి పని చేశారని గులాబీ శ్రేణులు సంతోషపడుతున్నాయి. లేకపోతే దేశవ్యాప్తంగా ఉన్న మోదీ మానియా తమపైనా పడేదన్న భావన వారిలో వ్యక్తమవుతోంది. ఇలా గులాబీ దళపతి వ్యూహం ఫలించింది. భారీ ఆధిక్యం సాధించి రెండో సారి అధికారం చేపట్టారు.

ఇదీ చూడండి: కేసీఆర్​ను కలిసిన తెరాస కొత్త ఎంపీలు

ABOUT THE AUTHOR

...view details