అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో మే 11న ఇందిరాపార్కు వద్ద ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ నిరసన దీక్ష నిర్వహించనున్నట్లు నేతలు తెలిపారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో అఖిలపక్ష పార్టీల నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తెజస అధ్యక్షుడు కోదండరాం, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ నేత ఎమ్ఆర్డీ వినోద్ పాల్గొన్నారు.
అవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే!
ఇంటర్ ఫలితాల తరువాత 26 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని.. అవి ప్రభుత్వ హత్యలేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్‌కు పార్టీ ఫిరాయింపుల మీద ఉన్న శ్రద్ధ విద్యార్థుల ఆత్మహత్యలపై లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తప్పును సరిదిద్దుకుంటే మంచిదని సూచించారు. నిరసన దీక్షను విజయవంతం చేయాలని తెజస అధ్యక్షుడు కోదండరాం పిలుపునిచ్చారు.