రాష్ట్రంలో జైళ్ల శాఖ చేపట్టిన సంస్కరణలు సత్ఫాలిస్తున్నాయి. కారగారాల్లో ఖైదీల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. ఓవైపు కొత్త జైళ్లు నిర్మించేందుకు నిధులు కావాలంటూ మిగతా రాష్ట్రాలు కేంద్రాన్ని అడుగుతుంటే... మన దగ్గర మాత్రం ఖైదీలు లేక ఉన్నవే మూతబడుతున్నాయి. తెలంగాణలో ఇప్పటికే 17 జైళ్లు మూసి వేశారు. ఈ పరిణామంతో ఉన్న సిబ్బందిని మిగతా జైళ్లకు పంపి ఖైదీలపై మరింత శ్రద్ధ పెట్టే అవకాశం ఏర్పడింది.
తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో 66 వేల 933 మంది రిమాండ్ ఖైదీలు,13 వేల 364 మంది శిక్ష పడ్డ ఖైదీలతో కలుపుకొని మొత్తం 80 వేల 297 మంది ఉండేవారు. 2018 నాటికి 43 వేల 823 మంది రిమాండు.. 11 వేల 463 శిక్షపడ్డ ఖైదీలను కలిపి వీరి సంఖ్య 55 వేల 286 తగ్గింది. నాలుగేళ్లలో 25 వేల 11 మంది ఖైదీలు తగ్గారు. జాతీయ నేరాల నమోదు సంస్థ (ఎన్.సి.ఆర్.బి) లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 2014లో అన్ని జైళ్లలో 4లక్షల 14 వేల 396 మంది ఖైదీలు ఉంటే... 2016 నాటికి 4 లక్షల 28 వేల 741 కు పెరిగారు. దేశ వ్యాప్తంగా ఖైదీల సంఖ్య ఏటికేడు పెరుగుతూనే ఉంది. తెలంగాణ జైళ్ల శాఖలో నిరక్ష రాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు విద్యా విధాన పథకం చేపట్టారు. జైళ్లకు వచ్చిన ప్రతి ఖైదీ కనీసం సంతకం పెట్టగలిగేలా చేయాలనేది దీని లక్ష్యం. ఒక్క 2018లోనే 18 వేల 675 మంది దీని ద్వారా శిక్షణ పొందారు. ఇప్పటివరకు లక్షా 25 వేల మందిని ఇలా అక్షరాస్యులుగా మార్చారు. అక్షరాస్యతతో ఖైదీల్లో అవగాహన పెరిగి.. మళ్లీ నేరబాట పట్టకుండా ఏదో ఒక ఉపాధి చేసుకునే అవకాశం ఉంటుంది.