ప్రతి ఒక్కరికి ఆధార్ అన్న నినాదంతో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ముందుకెళ్తోంది. అయిదేళ్ల లోపు పిల్లలకు బయోమెట్రిక్‌తో సంబంధం లేకుండా ఆధార్ కార్డు జారీ చేయాలని నిర్ణయించింది. హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం పరిధిలోని ఐదు రాష్ట్రాల్లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సమన్వయంతో కోటి 35 లక్షల మంది పిల్లలకు కార్డులు జారీచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందుకు అయ్యే ఖర్చును పూర్తిగా ఆధార్ సంస్థ భరించనుంది. నమోదుకు అవసరమైన కిట్ల కొనుగోలుకు అయ్యే వ్యయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో భరించాలని స్పష్టం చేసింది.
ఒక్కో ఛైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు అధికారి పరిధిలో మూడు కిట్లు కొనుగోలు చేసేందుకు రూ.25 కోట్లకు పైగా నిధులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించాయి. తెలంగాణ రూ. 4.02 కోట్లు, ఆంధ్రప్రదేశ్ రూ. 6.93 కోట్లు, ఒడిశా రూ. 9.12 కోట్లు, చత్తీస్ఘడ్ రూ. 5.94 కోట్లను కేటాయించాయి. అండమాన్ నికోబార్ నుంచి మాత్రం సరైన స్పందన లేదని ఆధార్ అధికారులు తెలిపారు. అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా వారి తల్లిదండ్రులు ఆధార్ కార్డుల ఆధారంగా గుర్తింపు కార్డులు జారీచేస్తామని అధికారులు తెలిపారు.