Amit Shah on Drugs: దేశంలో మాదకద్రవ్యాలపై పోరాటం సరైన దిశలో సాగుతోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మాదకద్రవ్యాలను పూర్తిగా అంతమొందించే వరకూ ఈ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. పంజాబ్ చంఢీగడ్‌లో మాదక ద్రవ్యాల రవాణా- జాతీయ భద్రతపై నిర్వహించిన 2 రోజుల జాతీయ సదస్సును అమిత్ షా ప్రారంభించారు. అనంతరం దిల్లీ, చెన్నై, గౌహతి, కోల్‌కతాలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ స్వాధీనం చేసుకున్న సుమారు 31 వేల కిలోలకుపైగా మాదకద్రవ్యాలను ధ్వంసం చేశారు.
Drugs destroyed India: ఆరోగ్యవంతమైన సమాజం, సుసంపన్నమైన దేశం లక్ష్యాన్ని చేరుకోవాలంటే డ్రగ్స్ ఉనికి ఉండకూడదని అమిత్ షా స్పష్టం చేశారు. డ్రగ్స్ అక్రమ వ్యాపారం వల్ల వచ్చే డబ్బును దేశ వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగిస్తున్నారని గుర్తు చేశారు. 2014లో మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పుడే డ్రగ్స్‌పై కఠినంగా వ్యవహరించాలన్న నిర్ణయం తీసుకున్నామని షా తెలిపారు. డ్రగ్స్‌పై పోరాటం వేగంగా, సరైన దిశలో పురోగమిస్తూ ఫలితాలను చూపించడం ప్రారంభించిందని షా తెలిపారు.