YSRCP Disqualification Complaint : గతేడాది ఏపీలో జరిగిన ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీను విభేదించిన ఆనం రాంనారాయణరెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డిపై అనర్హత వేటు వేయాలని వైఎస్సార్సీపీ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. వచ్చే నెలలో రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలోనే ఈ నలుగురికీ ఓటు హక్కు లేకుండా చేసేందుకే ఈ నిర్ణయం తీసుకుంది. వచ్చే నెలాఖరున రాజ్యసభ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున ఫిబ్రవరి మొదటివారంలో అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యేలోగానే ఈ నలుగురి వేటుపై నిర్ణయం తీసుకోనున్నారు.
2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపు గెలిచి తర్వాత వైఎస్సార్సీపీ పంచన చేరినవల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్, మద్దాలి గిరిధర్, కరణం బలరాం , జనసేన తరపు నెగ్గిన రాపాక వరప్రసాద్ కూడా వైఎస్సార్సీపీలో చేరారు. ఆయా నియోజకవర్గాల్లో వారు ఇప్పుడు వైఎస్సార్సీపీ అధికారిక సమన్వయకర్తలుగా కొనసాగుతున్నారు . వారిపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం జగన్ మార్క్ పాలనకే చెల్లింది.
'రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను కోరాం'
పార్టీని విభేదించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయం ఉన్నట్టు ఉండి వైఎస్సార్సీపీ అధినాయకత్వానికి గుర్తొచ్చింది. ఎప్పుడో గతేడాది మార్చిలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నలుగురు ఎమ్మెల్యేలూ వైఎస్సార్సీపీను విభేదించారు. ఇప్పుడు తీరిగ్గా 10 నెలల తర్వాత వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. అది రెండు మూడు నెలల్లో సాధారణ ఎన్నికలు జరగబోతున్న సమయంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడంతోపాటు, వారు వేరే పార్టీలో చేరారని వారిపై వెంటనే అనర్హత వేటువేయాలని డిమాండ్ చేశారు. తమ టికెట్లను ఎడాపెడా చించేస్తున్న వైఎస్సార్సీపీ అధిష్ఠానంపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు.