Young Woman Suicide at Lanco Hills : హైదరాబాద్‌లోని మణికొండ సమీపంలోని ల్యాంకోహిల్స్ పేరు వినగానే మీ అందరికీ.. నిత్యం కాపలా ఉండే భద్రతా సిబ్బంది.. చుట్టూ సీసీ కెమెరాలు గుర్తుకువస్తాయి. కానీ స్థానికులకు ఇంతటి కట్టుదిట్టమైన రక్షణ చర్యలున్నా లోపల జరుగుతున్న దారుణాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. కొద్దిరోజుల వ్యవధిలోనే అక్కడ ముగ్గురు ఆత్మహత్య చేసుకోవటం కలకలం సృష్టిస్తోంది. తాజాగామణికొండల్యాంకోహిల్స్(Manikonda Lanco Hills) అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న ఓ యువతి 21వ అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకోవటం సంచలనం రేపింది. మృతురాలి తండ్రి కృష్ణ ఫిర్యాదుతో రాయదుర్గం(Rayadurgam Police Station) పోలీసులు కేసు నమోదు చేశారు. యువతి బలవన్మరణానికి వేధింపులే కారణమని నిర్ధారించారు. పోలీసుల దర్యాప్తులో వ్యాపారి, కన్నడ నటుడు అయిన ఓ వ్యక్తి సాగిస్తున్న చీకటి కార్యకలాపాలు, దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
Kannada Film Actor Cheating in the Name of Film Offers : స్థానికులు, పోలీసుల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం.. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పూర్ణచంద్‌రావు కొన్ని కన్నడ సినిమాల్లో నటించాడు. పది సంవత్సరాల క్రితం హైదరాబాద్ నగరానికి వచ్చి బంజారాహిల్స్ కేంద్రంగా హోం థియేటర్ల వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో మణికొండ ల్యాంకోహిల్స్ అపార్ట్‌మెంట్స్ 15 ఎల్‌హెచ్ బ్లాక్‌లో భార్య, కుమార్తెతో ఉంటున్నాడు. కుమార్తె బాగోగులు చూసుకోవడం కోసం కాకినాడకు చెందిన బిందుశ్రీ(Caretaker Bindhu Sri Commits Suicide) అనే యువతి పదేళ్లుగా కేర్ టేకర్‌గా పని చేస్తోంది. అదే అపార్ట్‌మెంట్‌లో తనకు కేటాయించిన గదిలో ఉంటూ పూర్ణచందర్రావు కూతురి ఆలనా పాలనా చూసుకుంటోంది. అలా వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి వివాహేతర సంబంధానికి దారి తీసింది.
Young Woman Committed Suicide by Jumping from 21st Floor : కొద్ది రోజులుగా వీరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. దాంతో పూర్ణచంద్‌రావు కుమార్తెను సాకేందుకు 5 రోజుల క్రితం మరో యువతిని ఇంటికి తీసుకొచ్చాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి గొడవలు తారాస్థాయికి చేరాయి. రాత్రి 9 నుంచి అర్ధరాత్రి దాటేంత వరకూ పరస్పరం వాదించుకున్నట్టు పోలీసుల దర్యాప్తులో నిర్ధారించారు. ఆ తరువాత బిందుశ్రీ 21వ అంతస్తు పైనుంచి కిందకు దూకింది. గమనించిన సెక్యూరిటీ సిబ్బంది రాయదుర్గం పోలీసులకు సమాచారమిచ్చారు. పనిమనిషి ఆత్మహత్య విషయం పూర్ణచంద్‌రావుకు తెలియజేసేందుకు అతడి ఫ్లాట్‌కు చేరగా.. నింపాదిగా అరగంట తర్వాత తలుపులు తీయటంతో పోలీసులు విస్మయానికి గురయ్యారు.