World's longest teeth: జమ్ము కశ్మీర్ బుద్గాం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి నోట్లో నుంచి 'భారీ' పన్నును బయటకు తీశారు వైద్యులు. ప్రపంచంలోనే అతి పెద్ద పన్ను ఇదేనని వైద్యులు చెబుతున్నారు. ఈ పన్ను సైజు 37.5 మిల్లీమీటర్ల పొడవు ఉందని వైద్యులు వెల్లడించారు.
అమ్మో.. ఎంత పెద్ద పన్ను.. ప్రపంచంలోనే పొడవైనది ఇదే.. - longest teeth guinness record
సాధారణంగా నోట్లో ఉండే పళ్ల సైజు ఎంత ఉంటుంది? మహా అయితే.. అంగుళం లోపే ఉంటుంది. కానీ, ఓ వ్యక్తి నోట్లో నుంచి ఏకంగా 37.5 మిల్లీమీటర్ల పన్నును బయటకు తీశారు వైద్యులు. పూర్తి వివరాల్లోకి వెళ్తే...
ఎస్డీహెచ్ బీడ్వా ఆస్పత్రిలో చేరిన ఓ వ్యక్తి నోటి నుంచి ఈ పన్నును బయటకు తీసినట్లు వైద్యుడు జావైద్ అహ్మద్ వెల్లడించారు. బాధితుడికి గత 10-15 రోజుల నుంచి పంటి నొప్పి తలెత్తిందని తెలిపారు. ఆస్పత్రికి వచ్చిన అతడికి ఎక్స్రే తీయగా.. పన్ను సైజు అధికంగా ఉందని తెలిసిందన్నారు. దాన్ని తొలగించాల్సిన అవసరం ఉందని వైద్యులు చెప్పగా.. అందుకు రోగి ఒప్పుకున్నాడు. దీంతో శనివారం ఆపరేషన్ నిర్వహించి.. పన్నును బయటకు తీశారు.
పన్నును తొలగించేందుకు గంటన్నర సమయం పట్టిందని వైద్యుడు వివరించారు. గిన్నిస్ బుక్ రికార్డుల ప్రకారం ప్రపంచంలోనే అత్యంత పొడవైన పన్ను సైజు 37.2 మిల్లీమీటర్లు. ప్రస్తుతం బయటకు తీసిన పన్ను అంతకంటే పొడవుగా ఉంది కాబట్టి గిన్నిస్ రికార్డు ఈ పంటికి వచ్చే అవకాశం ఉంది.